కరోనాపై డోంట్ వర్రీ: ప్రజలు భయపడతారని అన్ని వివరాలు చెప్పట్లేదు : సీఎం కేసీఆర్

  • Publish Date - March 14, 2020 / 07:12 AM IST

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనీ..కరోను కట్టడి చేసేందుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యల్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతు..తెలంగాణలో కరోనా అనుమానులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు భయాందోళనలకు గురవుతారనే ఉద్ధేశ్యంతో అన్ని వివరాలు తెలియజేయట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. 

కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చిన సీఎం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. (తెలంగాణలో థియేటర్లు బంద్!)

దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్‌ సోకగా వీరిలో  17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ తెలిపారు. గాంధీ హాస్పిటల్లో కరోనా బాధిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వారి రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారని రిపోర్టు వచ్చిన తరువాత నిర్ధారణ అయితే వారికి చికిత్స చేస్తారని  కేసీఆర్‌ చెప్పారు.

కరోనాపై మంత్రివర్గ సమావేశంలో చర్చ 
కరోనా వైరస్‌ పై హైలెవల్‌ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్‌ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని సీఎం తెలిపారు. అనంతరం కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తామన్నారు సీఎం.