ఏపీలో రాజకీయాలు చేస్తాం : మంత్రి తలసాని  

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Publish Date - January 17, 2019 / 10:37 AM IST

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ’చంద్రబాబులా దేవాలయాల వద్ద రాజకీయం మేం చేయం. దేవాలయాల వద్ద రాజకీయాలు మాట్లాడే సంస్కృతి మాది కాదు. ’బంధువులు, బంధుత్వాల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు’ అని విమర్శించారు. హరికృష్ణ చనిపోతే రాజకీయాలు చేసింది ఎవరు ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ చనిపోతే అక్కడ కూడా చంద్రబాబు రాజకీయాలు చేశారని విమర్శించారు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. టీడీపీకి బీసీలంతా దూరమవుతారని పేర్కొన్నారు. ’ఏపీలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. కచ్చితంగా ఏపీలో రాజకీయాలు చేస్తాము’ అని తేల్చి చెప్పారు.

బాబు లేకపోతే అభివృద్ధి జరుగదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓడిపోతే ఏపీ డెవలప్ మెంట్ కాదంటున్నారని..తాను లేకపోతే ఎవరూ చేయలేరనే భావంతో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఏపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తుందో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టేది చంద్రబాబు అని ఆరోపించారు. గోబెల్స్ కు రిలేటివ్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ’ఈ చంద్రబాబు మాకు వద్దు అని ఏపీ ప్రజలు’ అంటున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోడీతో సంసారం చేసిన చంద్రబాబు…ఇప్పుడు రాహుల్ గాంధీతో కొత్త సంసారం మొదలు పెడుతున్నారని పేర్కొన్నారు. ’నేను రాజకీయాలనే మాట్లాడతాను. నేను రావాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఏపీ అభివృద్ధిని మేము అడ్డుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి ఏ విధంగా చేయాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోండి’ అని హితవు పలికారు. 

అవినీతిలో ఏపీ నెంబర్ వన్ అని అన్నారు. అడుగడుగునా అవినీతి ఉందని చెప్పారు. యాడ్స్ రూపంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. నవనిర్మాణ దీక్షల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. చిల్లర రాజకీయాల చేస్తే ధీటుగా సమాధానం చెబుతామన్నారు. మోడీ, కాంగ్రెస్ లేని ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ రావాలనేదే తమ ఆలోచన అని అన్నారు.