తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త పాలసీ 2021 వరకు అమల్లో ఉండనుంది. దీంట్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న మద్యం షాపులు తెరచి ఉంటాయి.
జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చారు. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 60 లక్షలు, లక్ష జనాభా నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రజలు ఉంటే ఏరియాకు రూ. 85 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒక కోటి 10 లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు.
కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా షాపుల యజమానుల సెలక్షన్ జరుగనుంది. దీంట్లో భాగంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. నిర్ధేశించిన సమయాల్లో మాత్రమే షాపులను తెరిచి ఉంటాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో భాగంగా షాపుల లైసెన్సులు కూడా రద్దు అయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.