తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వేసిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.
మలి విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా ప్రమాణం చేసే ఆ ఇద్దరు మహిళలు ఎవరన్న దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీతా రెడ్డి, రేఖానాయక్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం కేసీఆర్ సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదివరకే ఎమ్మెల్సీ ఆకుల లలిత టీఆర్ఎస్‌లో చేరారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మా దేవేందర్‌రెడ్డి లేదా విప్‌గా పనిచేసిన గొంగిడి సునీతరెడ్డిలలో ఎవరో ఒకరికి కేబినెట్‌లో స్థానం దక్కనుంది. అటు ఎస్టీ కోటా నుంచి ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు కాబట్టి.. రేఖానాయక్ లేదా సత్యవతి రాథోడ్‌లలో ఒకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది.