తెలంగాణ పోలీసులకు ఏపీలో శిక్షణ

  • Publish Date - September 24, 2019 / 02:37 AM IST

విద్యుత్, పోలీస్‌ ఉద్యోగుల విభజనతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చర్చలు జరిపారు. సోమవారం(సెప్టెంబర్23, 2019) హైదరాబాద్ ప్రగతి భవన్‌ లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్న క్రమంలో వారందరికీ ఏకకాలంలో శిక్షణ ఇవ్వనున్నారు. అందుకు స్థలం చాలనందు వల్ల 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌.. ఏపీ సీఎం జగన్‌ను కోరారు. ఇందుకు జగన్‌ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలుగనుంది.

తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎంలిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి రివర్సబుల్‌ టర్బైన్స్‌ ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించే అంశంపై కేసీఆర్, జగన్‌ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.