బంపర్ రికార్డ్ మెజార్టీ : హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు

  • Publish Date - October 24, 2019 / 09:05 AM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని చిత్తుగా ఓడించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలవటం ఇదే ప్రథమం. ఫస్ట్ టైం విక్టరీలోనే రికార్డ్ మెజార్టీ సాధించటం విశేషం. ఈ నియోజకవర్గంలో గతంలో 29వేల ఓట్ల మెజార్టీ అనేది అత్యధికం. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి 43వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో గెలుపొంది రికార్డ్ సృష్టించారు సైదిరెడ్డి.

టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి ఒక లక్షా 12వేల 796 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 69వేల 563 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామారావు కేవలం 2వేల 621 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి కేవలం వెయ్యి 827 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు ఎన్నికల అధికారులు.

ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మెజార్టీ సాధిస్తూ వచ్చారు. గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్.. ఏ దశలోనూ తన మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. ప్రతి గ్రామంలోనూ టీఆర్ఎస్ కు భారీగా ఓట్లు పడ్డాయి. మొదటి నుంచి పార్టీ గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు ఫలితం తర్వాత సంబరాలు చేసుకున్నాయి. టపాసులు కాల్చి రంగులు చల్లుకున్నారు.

కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టటంతో నూతనోత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నారు. ఎంపీగా గెలవటంతో.. తన స్థానంలో భార్య పద్మావతిని నిలబెట్టారు. అయినా ఫలితంగా లేకపోయింది. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ హవాకి కొట్టుకుపోయింది కాంగ్రెస్.