ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరు గార్చటానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడలకు మోసపోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. మంగళవారం(నవంబర్ 5,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులతో సమావేశం అయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 32వ రోజు కొనసాగుతోంది. ఎవరెన్ని రకాలుగా బెదిరించినా సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు డిపోల దగ్గరికి వెళ్లి కార్మికులను విధుల్లోకి చేరమని చెపుతున్నా ఎవరూ చేరని పరిస్ధితి ఉందన్నారు.
కొత్తగూడెం, మహబూబా బాద్ డిపోల దగ్గర పోలీసులు టెంట్లు పీకేసి కార్మికులను అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీని మూసేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే తీసుకునే నిర్ణయం కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. చట్ట ప్రకారం ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా, రాష్ట్రానికి 69 శాతం వాటా ఉంటుందని ఆయన వివరించారు. ఆర్టీసీ అస్ధిత్వాన్ని దెబ్బతీసే ఏ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేయలేదని ఆయన వివరించారు.
తెలంగాణ ఆర్టీసీ బోర్డు ఇంతవరకు ఏర్పడలేదని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. భైంసాలో ఆర్టీసీ డిపో మేనేజర్ పై జరిగిన దాడిని సమావేశంలో ఖండించినట్లు చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు.