UK Returnies: యూకే వైరస్ గురించి తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేర యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల జాబితా రెడీ చేసి పరీక్షలు చేయాలని రెడీ అయింది. అయితే కొందరు వ్యక్తులు రీసెంట్ గా కాకుండా ఇంతకుముందే రావడంతో వారెవరెవరిని కలిశారనే దానిపై దృష్టి సారించారు.
డిసెంబర్ 14న ఓ ప్రయాణికుడు యూకే నుంచి చెన్నైకి.. అక్కడ్నించి హైదరాబాద్‌కు విమానంలో వచ్చాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో కలిసి సుల్తాన్‌బజార్ సహా పలు ప్రాంతాల్లో షాపింగ్‌లు చేశాడు. ఆ తర్వాత సోదరి ఎంగేజ్మెంట్ వేడుకలోనూ పాల్గొన్నాడు. తండ్రి షష్టి పూర్తి వేడుకలనూ ఘనంగా జరిపించాడు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిన వ్యక్తి అక్కడా షాపింగ్ చేశాడు.
అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ పరీక్షలు జరుపుతుండగా అతని వివరాలు తెలుసుకుంది. కొవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చింది. అంతే ఆ వ్యక్తిలో యూకే వైరస్ కూడా ఉందా? అనే విషయం కన్ఫామ్ చేసుకోవడానికి శాంపుల్స్‌ను సీసీఎంబీకి పంపించారు. ఓవైపు ఫలితాల కోసం చూస్తూనే.. అతణ్ని కలసిన వారిలో 84 మందిని గుర్తించి వారి శాంపుల్స్‌ను కొవిడ్ పరీక్షకు పంపించారు.
రాష్ట్రానికి డిసెంబర్ 9 నుంచి వెయ్యి 216 మంది యూకే ప్రయాణికులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఇప్పటికే 996 మందికి పరీక్షలు నిర్వహించారు. 966 మందికి కరోనా నెగిటివ్‌గా వెల్లడవగా.. 21 మందిలో మాత్రం పాజిటివ్ అని తేలింది. కొవిడ్ కన్ఫామ్ అయిన వారి శాంపుల్స్‌ను సీసీఎంబీకి పంపించగా.. ఇప్పటికే ఇద్ధరిలో యూకే వైరస్ ఉన్నట్లుగా కన్ఫామ్ అయింది.
వైరస్ ఎంతమందికి వచ్చిందనేది ప్రశ్నగానే
యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అందరూ నేరుగా హైదరాబాద్‌కు చేరుకోలేదు. పలు మార్గాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు దాదాపు 200 మందికి పైగానే ఉన్నారు. వారందరిలోనూ యూకే వైరస్ ఉంటే.. సహ ప్రయాణికుల్లో ఎంతమందికి వ్యాప్తి చేసి ఉంటారనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా GHMC పరిధిలోనే దాదాపు 70 శాతానికి పైగా యూకే ప్రయాణికులు ఉండడంతో.. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు.