బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైపోయింది. అప్పటికి ఇండియాలో లాక్‌డౌన్ ప్రారంభమైంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ప్రజాసమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న అవినీతిపై ఆయన పోరాడాలని డిసైడ్ అయ్యారట. కానీ కరోనా వచ్చి ఆయన ప్లాన్స్ అన్నింటినీ దెబ్బ తీసేసింది. ఎలాగైనా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న బండి సంజయ్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నారట.
ఈ సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వం వర్చువల్ ర్యాలీ అంటూ ప్రారంభించింది. దీంతో ఆయన ప్లాన్స్ కాస్త వెనుకబడిపోయాయట. జాతీయ నాయకత్వం ఆలోచనను అందిపుచ్చుకున్న బండి సంజయ్… మరిన్ని వ్యూహాలను జోడించి ప్రజల్లోకి వెళ్తున్నారు. వర్చువల్ ర్యాలీలతో పాటు రాష్ట్ర, జిల్లాస్థాయి, బూత్ లెవెల్ లీడర్లతో వెబినార్స్ నిర్వహిస్తోంది. నేరుగా కార్యకర్తలతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాకుండా సోషల్ మీడియా ప్రమోషన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారట. సోషల్ మీడియాలో బహుముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో బీజేపీ నేతలు ప్రసంగాలతో పాటు.. అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికగా ప్రత్యేకమైన టెంప్లేట్స్ తయారుచేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేలా కథనాలను పోస్టర్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పదేపదే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనిని బీజేపీ ఐటీ సెల్ విభాగం ప్రణాళిక ప్రకారం అమలు చేస్తోంది. ఇదే తరహాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం బూత్ స్థాయి నాయకులతో వెబినార్ ద్వారా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారట. మరి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.