కోవిడ్ -19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా ఏడు లక్షలకు చేరువైంది. ఇందులో 32వేల 239 మంది మరణించారు.
కోవిడ్ -19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 199 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. కరోనాను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇక కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా ఏడు లక్షలకు చేరువైంది. ఇందులో 32వేల 239 మంది మరణించగా… ఈ వ్యాధి నుంచి లక్షా 46 వేల 400 మంది కోలుకున్నారు.
ఇటలీలో 10వేలు దాటిన మృతుల సంఖ్య
ఇక ఇటలీలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఇటలీలో దాదాపు సీనియర్ సిటిజన్స్ ఖాళీ అయిపోయారు. కరోనా వైరస్ వల్ల ఇటలీలో మృతిచెందిన వారి సంఖ్య పదివేలు దాటింది. ఆ దేశంలో వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 90 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే ఇటలీలో వైరస్ వల్ల ఒక్క రోజే 889 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 10 వేల 23కు చేరుకుంది.
స్పెయిన్‌లో 832 మంది మరణం
స్పెయిన్‌లో కరోనా వైరస్ విజృంభించింది. ఒక్కరోజులో కొత్తగా 6500కుపైగా కేసులు వెలుగు చూశాయి. 832 మంది రోగులు చనిపోయారు. 9వేల మందికిపై ఆరోగ్య సిబ్బంది ఈ మహమ్మారి బారినపడ్డారు. ప్రస్తుతం స్పెయిన్ లో కరోనా రోజుల సంఖ్య 80వేలకు చేరువలో ఉంది.. మరోవైపు స్పెయిన యువరాణి మరియా థెరిసా కరోనా వైరస్ సంక్రమణతో కన్నుమూశారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. ప్రపంచంలోని ఒక రాజ కుటుంబం నుండి నమోదైన తొలి కరోనా మృతి కేసు ఇది.
కరోనా భయంతో జర్మనీ ఆర్థిక మంత్రి ఆత్మహత్య
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్… జర్మనీ ఆర్థిక మంత్రిని బలి తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడటంతో ఆర్థికమంత్రి థామస్ షేపర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా విజృంభణ రోజురోజకీ తీవ్ర రూపం దాల్చుతుండడంతో అమెరికన్లు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఏమాత్రం చలించట్లేదు. వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్, మూడు రాష్ట్రాల గవర్నర్లతో సంప్రదించిన తరువాత దిగ్బంధం అవసరం లేదని నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు.
న్యూయార్క్ లో 883 మంది మృతి
న్యూయార్క్ నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రపంచస్థాయి కార్యాలయాలకు నెలవైన న్యూయార్క్ నగరం ఇపుడు కరోనాకు కేంద్ర స్థానంగా మారిపోయింది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఇప్పటిదాకా 53 వేల 455 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 883 మంది మరణించారు. అమెరికాలో దాదాపు లక్షా 25వేల మంది కరోనాతో బాధపడుతున్నారు.
చైనాలో మళ్లీ కొత్తగా 45 కేసులు
కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో కరోనా వైరస్ మరణాలు ఇంకా ఆగటం లేదు. హేనన్, హుబే ప్రావిన్సులలో కొత్తగా 45 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. చైనాలో తగ్గుముఖం పట్టిన సమయంలో మళ్లీ కొత్తగా 45 కేసులు నమోదు కావడం ప్రజల్లో కలవరం రేపింది.
See Also | ఏపీలో 21కి చేరిన కరోనా కేసులు…ఇద్దరు విశాఖ వాసులకు వైరస్