Sugar Molecules : అంతరిక్షంలో ‘చక్కెర’ ఆనవాళ్లు.. జీవం ఆవిర్భావ రహస్యాన్ని ఛేదించే దిశగా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

Sugar Molecules : అనంత విశ్వంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. మన పాలపుంత మధ్యలో ప్రాణకోటి పుట్టుకకు కారణమయ్యే కీలకమైన చక్కెర అణువులను స్పెయిన్ ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Sugar Molecules

Sugar Molecules : అనంత విశ్వంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. మన పాలపుంత మధ్యలో ప్రాణకోటి పుట్టుకకు కారణమయ్యే కీలకమైన చక్కెర అణువులను స్పెయిన్ ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో నక్షత్రాలు, గ్రహాలు పుట్టక ముందే విశ్వంలో జీవరాశి ఆవిర్భావానికి బీజం పడిందా అంటే.. తాజా పరిశోధన అవుననే అంటోంది. భూమిపై ప్రాణకోటి మనుగడకు కణాల నిర్మాణానికి చక్కెర అణువులు అత్యంత కీలకంగా భావిస్తారు. అయితే, తాజా ఆవిష్కరణ జీవం ఆవిర్భావంపై జరుగుతున్న పరిశోధనలకు కొత్త దిశను చూపుతోంది.

Also Read : AP Govt : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వినియోగదారులకు ఊరట!

స్పెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఆస్ట్రోబయాలజీ శాస్త్రవేత్తల బృందం పాలపుంత మధ్యలో నక్షత్రాల నడమ ఉన్న వాయు దూళి మేఘాల్లో ఒక ప్రత్యేకమైన చక్కెర అణువును గుర్తించారు. రెండు భారీ రేడియో టెలిస్కోపుల ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టారు. ఎరిత్రోలోజ్ అని పిలిచే ఈ చక్కర అణువులను కనుగొన్నట్లు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీ అధికారికంగా వెల్లడించింది. మనం నిత్యం తినే పండ్లలో కనిపించే ఈ చక్కెర అంతరిక్షంలో దొరకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భూమి వెలుపల ఇతర గ్రహాలపై జీవరాశి ఉందా అనే దానికి ఈ పరిశోధన మరింత బలాన్ని చేకూరుస్తుంది.

స్పెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఆస్ట్రోబయాలజీ శాస్త్రవేత్తల బృందం ‘ఎరిథ్రులోజ్’ (Erythrulose) అనే చక్కెరను గుర్తించింది. ఇది నాలుగు కార్బన్ పరమాణువులతో కూడిన చక్కెర. జీవుల్లో శక్తి ఉత్పత్తి, జీవకణాల నిర్మాణం, అలాగే RNA, DNA వంటి జన్యు పదార్థాల నిర్మాణంలో చక్కెరలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఇప్పటి వరకు అంతరిక్షంలో సంక్లిష్ట అణువులు ఒక్కో కార్బన్ పరమాణువు చొప్పున ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావించేవారు. కానీ, నాలుగు కార్బన్‌లతో కూడిన ఈ చక్కెర అంతరిక్షంలోనే ఏర్పడటం ఆ సిద్ధాంతానికి కొత్త కోణాన్ని జోడించింది. పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇజాస్కున్ జిమెనెజ్ సెర్రా మాట్లాడుతూ.. నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడకముందే అంతరిక్షంలోనే ఇలాంటి సంక్లిష్ట చక్కెరలు తయారవుతాయని మా పరిశోధన వెల్లడించిందని తెలిపారు.

భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధం ఉందా?
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఈ చక్కెర అంతరిక్షంలోని మంచుతో కప్పబడిన ధూళి కణాలపై ఏర్పడి, తరువాత గ్రహశకలాలు, తోకచుక్కల ద్వారా భూమికి చేరి ఉండొచ్చు. ఇప్పటికే బెన్నూ అనే గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాల్లో కూడా కొన్ని చక్కెర అణువులను గుర్తించారు. దీంతో భూమిపై జీవానికి అవసరమైన సేంద్రీయ పదార్థాలు అంతరిక్షం నుంచే వచ్చి ఉండొచ్చుననే సిద్ధాంతానికి మరింత బలం చేకూరుతోంది.

ఈ ఆవిష్కరణతో ఇప్పుడు ఆర్ఎన్ఏలో కీలకమైన రైబోస్ వంటి మరిన్ని చక్కెరలను కూడా అంతరిక్షంలో గుర్తించే అవకాశాలు పెరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా పరిణామంతో జీవం ఆవిర్భావానికి కీలకమైన మరిన్ని చక్కెరలు, ఇతర సేంద్రీయ అణువులను అంతరిక్షంలో గుర్తించే అవకాశాలు ఇప్పుడు మరింత పెరిగాయని పరిశోధన సహ రచయిత కార్లోస్ బ్రియోనెస్ పేర్కొన్నారు.