Viral Video: గర్భాన్ని ముద్దాడిన పిల్ల కోతి.. మహిళ భావోద్వేగం!

సృష్టిలో భావాలు.. వాటి అనుభూతి అంతా ఒక్కటే. దేశం మారినా.. ఆచార, సంప్రదాయాలు మారినా అనుభూతిలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే యుగాల నుండి కొన్ని రకాల జంతువులకు..

Viral Video

Viral Video: సృష్టిలో భావాలు.. వాటి అనుభూతి అంతా ఒక్కటే. దేశం మారినా.. ఆచార, సంప్రదాయాలు మారినా అనుభూతిలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే యుగాల నుండి కొన్ని రకాల జంతువులకు, మనుషులకు మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్పుకుంటుంటాం. ముఖ్యంగా కోతులతో మనుషులకు సారూప్యతతో పాటు అనుబంధం కూడా ఎక్కువగానే ఉంటుంది. బహుశా అందుకేనేమో ఓ కోతి పిల్ల మహిళ గర్భంలో శిశువును ముద్దాడుతూ తన అనుభూతిని తెలియజేస్తే.. ఆ మహిళ కోతిపిల్ల ప్రేమకి పరవశించిపోయింది.

ఇంగ్లాండ్‌లోని గ్లౌసెస్టర్‌కి చెందిన నవోమి డేవిస్(34), భర్త బెన్ బిల్లింగ్‌హామ్(40) లీసెస్టర్‌షైర్‌లోని ట్విక్రాస్ జూకు వెళ్లారు. అప్పటికి నవోమి నాలుగు నెలల గర్భవతి కాగా జూలోని ఒరంగుటాన్ ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ కొన్ని కోతులను చూస్తుండిపోయాడు. ఇంతలో ఓ పెద్ద కోతి, దాని పిల్ల కోతి వాళ్ళని చూసి దగ్గరగా వచ్చాయి. కోతులకు ఈ జంటకి మధ్య గ్లాస్ ఉండడంతో వారు కూడా ఆ కోతులను ఆసక్తిగా గమనిస్తూ ఆగిపోయారు. ఈలోగా పెద్ద కోతి తన బిడ్డని వీపుపై ఎక్కించుకొని అద్దానికి దగ్గరగా వచ్చాయి.

ఆ కోతుల ఆసక్తిని గమనించిన బెన్ నవోమిని అద్దానికి దగ్గరగా వెళ్ళమనడంతో ఆమె దగ్గరకి వెళ్ళింది. దీంతో ఆ కోతిపిల్ల ఆమె బేబీ బంప్ పై అద్దంపై నుండే ముద్దాడింది. దీనిని పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఆ కోతులు తన బేబీ బంప్ చూసి ముద్దాడిన క్షణం తాను ఎంతో చలించిపోయానని చెప్పిన నవోమి అసలు తన గర్భం ఆ కోతులకు కనిపించడమే తానసలు ఊహించనేలేదని.. ఇక ఆ చిన్న కోతి అలా పదేపదే ముద్దాడుతుంటే చాలా భావోద్వేగానికి లోనయ్యానని చెప్పింది.