Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 40 మంది మృతి..

Pakistan Bus Accident : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడడంతో 40మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

Pakistan Bus Accident

  • పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం
  • లోయలోకి దూసుకెళ్లిన బస్సు
  • 40మంది మృతి.. 8మందికి గాయాలు

Pakistan Bus Accident : పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని షేరానీ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read : NEET Re-Exam Results: నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్ డేట్ ఫిక్స్.. కౌన్సిలింగ్ నిబంధనలు విడుదల

ప్రమాద సమాచారం అందుకున్న షేరానీ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఝోబ్‌లోని ట్రామా సెంటర్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

36మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బస్సు బయలుదేరింది. అయితే, మరో బస్సు మార్గమధ్యలో చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను కూడా ఇదే బస్సులో ఎక్కించడంతో వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు వేగంగా ఉందని, అదుపు తప్పి భారీ లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని అన్నారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పాకిస్థాన్‌లో గుంతల రహదారులు, ట్రాఫిక్ నిబంధనల అమలులో లోపాలు, ప్రమాదకర డ్రైవింగ్ కారణంగా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో జరిగిన అత్యంత విషాదకర రోడ్డు ప్రమాదాల్లో ఇది ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.