చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖానికి మాస్క్ ధరించుకుని దేశ రాజధాని బీజింగ్ లో పర్యటించారు. బీజింగ్ లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ (covid 19) నిర్ధారణ పరీక్షల శిబిరం వద్ద నిర్వహణలను తొలిసారిగా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జిన్ పింగ్ జ్వర పరీక్షలతో పాటు కరోనా వైరస్ టెస్ట్ లు చేయించుకున్నారు. కరోనా బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.
కరోనా వైరస్(coronavirus)..పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు పోయాయి. దాదాపు 43వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా కరోనా వైరస్ గురించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వీలైనంత త్వరగా కరోనాను కంట్రోల్ చెయ్యలేకపోతే.. ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80శాతం మంది జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని హాంకాంగ్ కు చెందిన పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ను అంతం చేయటానికి చైనా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. చైనాలో ఉంటున్న వారికే కాదు.. అసలు చైనాకి వెళ్లని వారికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి ద్వారా మరో ఐదుగురికి వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుంది అనే దాని గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
వైరస్ ఎక్కువగా దగ్గు ద్వారా వ్యాపిస్తుందా లేక జలుబు ద్వారానా అనేది కన్ ఫర్మ్ గా చెప్పలేకపోతున్నారు. వైరస్ గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైరస్ ఎలా వచ్చింది? ఎలా వ్యాపిస్తుంది? అనే దానిపైనే ఇప్పటివరకు క్లారిటీ లేదు.. ఇక.. వ్యాక్సిన్ కనుక్కోవడం అంత ఈజీ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా కరోనాని కట్టడి చెయ్యలేకపోతే మాత్రం.. ఊహించని ఘోరం జరిగిపోతుందని శాస్త్రవేత్తలు భయాందోళన చెందుతున్నారు.