చనిపోయిన బాలిక అంత్యక్రియల్లో గంటసేపు మళ్లీ బతికి చనిపోయింది
- Subhan Ali Shaik
- Published On : August 24, 2020 / 08:03 PM IST
చనిపోయిన బాలిక అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో చనిపోయిందనుకున్న బాలిక కళ్లు తెరవడంతో దుఖంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. దాంతోపాటు ఆ ఘటనతో వారి కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఓ గంట తర్వాత మళ్లీ చనిపోయింది. ఈ వింత సంఘటన ఇండోనేషియాలో జరిగింది.
ఇండోనేషియా, ఈస్ట్ జావాకు చెందిన సితి మస్‌ఫుఫాహ్ వర్దాహ్ అనే 12 ఏళ్ల బాలిక క్రోనిక్ డయాబెటిస్‌తో బాధపడుతూ ఆగష్టు 18న అక్కడి ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయిన కుటుంబసభ్యులు అంత్యక్రియల కోసం శవాన్ని సిద్ధం చేస్తున్నారు. మృతదేహానికి స్నానం చేయించిన అనంతరం సితి శరీరం వెచ్చగా మారింది. మూసుకున్న కళ్లు తెరుచుకోవడంతో పాటు శరీరంలో కదలికలు గమనించారు.
గుండె మళ్లీ కొట్టుకోవటం మొదలైంది. వెంటనే సితి తండ్రి వైద్యులను తీసుకువచ్చాడు. వారు బాలికకు ఆక్సిజన్ అందించి గమనిస్తూ ఉన్నారు. ఓ గంట పాటు బతికిన బాలిక తర్వాత మళ్లీ చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు శవానికి మళ్లీ స్నానం చేయించి శ్మశానంలో ఖననం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
