Donald Trump Truth Social : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు.. డబ్బిస్తే ముందే సమాచారం.. ఇదే పద్దతిరా బాబూ..
Donald Trump Truth Social : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ లో కొత్త ఫీచర్ ట్రూత్ పీఎస్ఐ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
Donald Trump Truth Social
Donald Trump Truth Social : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు కేంద్రంగా నిలుస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడి హోదాలో పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ మార్కెట్లను కుదేలు చేస్తున్న ట్రంప్.. తాజాగా.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ (Truth Social) లో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Mexico Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. ముందుకు దూసుకొచ్చిన సముద్రం.. వీడియోలు వైరల్
ట్రూత్ పీఎస్ఐ పేరుతో ఈ ప్రీమియం సర్వీస్ తీసుకురావాలని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ యోచిస్తోంది. ఈ కొత్త సేవ ద్వారా ట్రంప్ వంటి ప్రముఖుల పోస్టులను సోషల్ మీడియాలో ప్రచురించకముందే స్టాక్ ట్రేడింగ్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సేవ ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
మదుపర్లు, ట్రేడింగ్ సంస్థలే లక్ష్యంగా ఈ సేవలు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుదనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ట్రూత్ సోషల్ మాతృసంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్‌గర్న్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈ పీఎస్ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్న సంస్థలకు ట్రంప్ వంటి ప్రభావవంతమైన వ్యక్తుల పోస్టులు పబ్లిక్‌గా కనిపించకముందే అందుతాయని, కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడమే ఈ సేవ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసే పోస్టులు తరచూ అమెరికా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. ఉదయం చేసిన ఒక ప్రకటనతో మార్కెట్లు భారీగా పతనమవడం, కొద్ది గంటల తర్వాత మరో ప్రకటనతో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకోవడం వంటి పరిణామాలు గతంలో చోటుచేసుకున్నాయి. దీంతో మార్కెట్ ఒడిదుడుకులను ముందుగానే అంచనా వేసిన పెట్టుబడిదారులు భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే అధ్యక్షుడి హోదాలో పాలనా పరంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. తాజాగా.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా భారీ ఆధాయాన్ని పొందాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కొత్త పీఎస్ఐ పై అమెరికాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ పోస్టులు ముందుగానే అందుకునే సంస్థలు వాటి ప్రభావాన్ని అంచనావేసి స్టాక్స్‌ను ముందే కొనుగోలు లేదా విక్రయించే అవకాశం ఉంటుందని, ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ కిందికి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. డొనాల్డ్ ట్రంప్ 2022లో సోషల్ మీడియా వేదిక ఎక్స్ (అప్పటి ట్విట్టర్) నుంచి దూరమైన తర్వాత ట్రూత్ సోషల్ను ప్రారంభించారు. అప్పటి నుంచి తన కీలక రాజకీయ, ఆర్థిక ప్రకటనలను ప్రధానంగా ఈ వేదిక ద్వారానే వెల్లడిస్తున్నారు. ట్రూత్ సోషల్ మాతృసంస్థ TMTGలో ట్రంప్ కుటుంబానికి సుమారు 41 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్ యుద్ధం వేళ ట్రంప్, ఆయన కుటుంబం, సన్నిహితులు కొందరు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. దీంతో ఈ ప్రీమియం సర్వీస్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
