Petrol Prices: వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్, డీజిల్(Petrol Prices) ధరలు తగ్గుతాయని వాహనదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Central government clarifies rumors regarding petrol price cut.
- పెట్రోల్ ధరల తగ్గింపుపై అస్పష్టత
- ఆయిల్ కంపెనీల చేతిలోనే రేట్లు
- భారత్‌లోనే తక్కువ ధరల పెరుగుదల
Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు నిలకడగా మారడం, ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ఇంధన ధరల కోతపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ప్రస్తుతం ధరల తగ్గింపుపై ఎలాంటి కొత్త ప్రకటన లేదని స్పష్టం చేసింది. భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరల నిర్ణయం మార్కెట్ పరిస్థితులకు లోబడి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల చేతుల్లోనే ఉంటుందని తేల్చిచెప్పింది.
అంతర్జాతీయంగా పెరిగిన ధరలు:
పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేష్ గోపి పార్లమెంట్లో మాట్లాడుతూ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఇంధన (Petrol Prices)ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉందని తెలిపారు. జూన్ 2021 నుండి జూన్ 2026 మధ్యకాలంలో అమెరికాలో పెట్రోల్ ధరలు 70.6 శాతం, పాకిస్తాన్లో 160.6 శాతం, శ్రీలంకలో 148.6 శాతం మేర పెరిగాయని వివరించారు. దానికి భిన్నంగా భారత్‌లో పెట్రోల్ ధర కేవలం 8.1 శాతం, డీజిల్ ధర 11.5 శాతం మాత్రమే పెరిగాయని, పొరుగు దేశాల కంటే ఇక్కడే చౌకగా లభిస్తోందని ఆయన గణాంకాలతో వెల్లడించారు.
ఎక్సైజ్ సుంకం కోత, గతంలో జరిగిన ధరల పెంపు:
వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో లీటర్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, దీనివల్ల ప్రభుత్వ రాబడి తగ్గినా ప్రజలకు ఊరట లభించిందని కేంద్రం పేర్కొంది. కాగా ఇరాన్-అమెరికా ఘర్షణల అనంతరం కేంద్రం ఏప్రిల్, మే నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగైదు సార్లు సవరించి స్వల్పంగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, కొత్తగా ధరలు తగ్గించే ప్రత్యక్ష పాత్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేయడంతో తక్షణ లబ్ధి కోసం వాహనదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
