US Gold Card: ట్రంప్ బంపర్ ఆఫర్.. అమెరికా సిటిజన్ షిప్ కావాలనే వారికి గోల్డ్ కార్డు.. మీరు చేయాల్సింది..

అమెరికన్ పౌరసత్వం పొందటానికి డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఐదు మిలియన్ డాలర్లు చెల్లిస్తే గోల్డ్ కార్డు వీసా ద్వారా అమెరికాలో శాశ్వత సభ్యత్వాన్ని..

Donald Trump

US Gold Card Visa: అమెరికాకు అక్రమంగా వలస వెళ్లినవారిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయా దేశాలకు చెందిన వలసదారులను ప్రత్యేక విమానాల ద్వారా సంకెళ్లు వేసి వారివారి దేశాలకు పంపిస్తున్నారు. అయితే, తాజాగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల కోసం 35ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చేయోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దాని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు.

 

అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు (రూ. 43,56,48,000) పెట్టుబడి పెట్టేవారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఈ గోల్డ్ కార్డు విషయంపై వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో ఈబీ-5 వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ఈ గోల్డ్ కార్డు ఒకరకంగా శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు లాంటిదేనని అన్నారు. ఈబీ-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామని చెప్పారు.

 

ఈవీ-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. అమెరికాలో దాదాపు ఎనిమిది వేల మంది ఇన్వెస్టర్లు ఈ వీసాలను పొందారు. ఈబీ-5 వీసాల స్థానంలోనే గోల్డ్ కార్డులను ట్రంప్ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కిపైగా దేశాల్లో గోల్డెన్ వీసాలు అమల్లో ఉన్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటీలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ కూడా ఈబీ-5 వీసాల స్థానంలో గోల్డ్ కార్డుల విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 

ట్రంప్ మాట్లాడుతూ.. మాకు 35ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. అయితే, 10లక్షల గోల్డ్ కార్డులు ఐదు మిలియన్ డాలర్ల చొప్పున విక్రయించినా ఐదు ట్రిలియన్ డాలర్లు వస్తుంది. దానిద్వారా కొంత అప్పు తీరుతుందని పేర్కొన్నారు. రష్యన్లకు కూడా ఇలాంటి కార్డులు ఇస్తారా అని ప్రశ్నించగా.. అందరికీ గోల్డ్ కార్డులు అందిస్తామని చెప్పారు. ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు అమెరికాలో స్థిరపడేలా చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళికగా భావిస్తున్నారు.

 

ట్రంప్ ఆలోచన ప్రకారం.. గోల్డ్ కార్డు వీసా ద్వారా అమెరికన్ పౌరసత్వం పొందడానికి ఒక మార్గం. దీనివల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీనికి కారణం ఏమిటంటే.. ధనవంతులు మాత్రమే ఈ గోల్డ్ కార్డు వీసాను కొనుగోలు చేసి అమెరికాలో స్థిరపడగలరు. అమెరికాలో వారు వ్యాపారాలు చేసుకోవటంతోపాటు.. ఇతర ఖర్చుల ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. దీనికితోడు అమెరికాలోని చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది.