Indonesia Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Indonesia Earthquake : ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. తొలుత రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతో భూకంపంరాగా.. కొద్ది నిమిషాల వ్యవధిలోని మరో రెండుసార్లు స్వల్ప భూకంపాలు సంభవించాయి.
- Harish Thanniru
- Updated on- August 15, 2026 / 06:55 AM IST
Indonesia Earthquake
Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని నుసా తెంగ్గరా ప్రావిన్సు ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఎండే నగరానికి ఉత్తర – వాయవ్య దిశగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో..10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తరువాత.. అదే ప్రాంతంలో 5.6, 5.9, 6.1 తీవ్రతతో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈస్ట్ నుసా టెంగారా, సౌత్ సులవేసి, వెస్ట్ నుసా టెంగారా ప్రావిన్సుల్లో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలలు 0.5 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు ఎత్తు ఉండొచ్చని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. దీంతో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు తెలిసింది. అయితే, వరుస భూకంపాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు.
