Strait Of Hormuz : ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధి ఒపెన్

Strait of Hormuz : ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది.

Iran Big Announcement Strait Of Hormuz Completely Open During Ceasefire

Strait Of Hormuz : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి.. నౌకల రాకపోకలకు అనుమతి తెలిపినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్.. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని ప్రకటిస్తూ.. ‘ఎక్స్’ (X) వేదికగా పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ ఇరు దేశాల మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇదే విధంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేందుకు అవకాశం ఉందంటున్నారు. అలాగే హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు. ఇకపై హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు పూర్తి స్థాయిలో ప్రయాణాలు చేస్తాయని వెల్లడిస్తూ.. ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.