Panama Earthquake : పనామాలో భూకంప బీభత్సం.. 7.7 తీవ్రతతో ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
Panama Earthquake : పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పనామా సిటీలో ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 40కి పైగా ఆఫ్టర్‌షాక్స్, భవనాల నష్టంపై పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- October 10, 2026 / 09:40 AM IST
Panama Earthquake
- పనామాలో భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన ప్రాంతాలు
- ఒక్కసారిగా కంపించిన భూమి.. భయంతో జనం పరుగులు
- పనామాను వణికించిన ప్రకృతి ప్రకోపం.. ఆఫ్టర్‌షాక్స్‌తో ఆందోళన
Panama Earthquake : మధ్య అమెరికా దేశం పనామాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పనామా సిటీ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
భూకంప కేంద్రం ఎక్కడంటే? :
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వివరాల ప్రకారం.. పనామాలోని హెర్రెరా ప్రావిన్స్‌లో పిటాలోజా అర్రిబా సమీపంలో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలుస్తోంది. భూమికి సుమారు 12.6 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భూకంపం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భవనాలు, రహదారులు దెబ్బతిన్నట్లు తెలిసింది.
మాల్ నుంచి రోడ్లపైకి పరుగులు :
భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. షాపింగ్ మాల్స్‌లో ఉన్నవారు సైతం లోపల ఉండటం ప్రమాదకరమని భావించి బయటకు పరుగులు తీశారు. పనామా సిటీలోని టౌన్ సెంటర్ మాల్ నుంచి ప్రజలు బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు చోట్ల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో జనమంతా గుమిగూడారు.
40కి పైగా ప్రకంపనలు.. ప్రజల్లో ఆందోళన :
భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వరుస ప్రకంపనలతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రాణనష్టం, ఆస్తి నష్టం :
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. భవనాలకు జరిగిన నష్టం, ఇతర ప్రాంతాలపై ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప తీవ్రతను తొలుత 8.0గా అంచనా వేయగా ఆ తర్వాత 7.7గా సవరించినట్లు తెలుస్తోంది.
