మలేరియా మందు కరోనాపై పనిచేస్తుందా? తెలుసుకోవాల్సిన వాస్తవాలు!

  • Publish Date - April 16, 2020 / 04:17 AM IST

కరోనా వైరస్‌కు ఎలాగో మందు లేదు. అది వచ్చేసరికి ఏడాదిపైనే పడుతుంది. అందుకే మలేరియా మందు ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’తో కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని చాలా దేశాలు అదే నమ్ముతున్నాయి. కరోనా బాధితులను రక్షించుకునేందుకు అమెరికా, బ్రెజిల్ దేశాలతో పాటు 30 దేశాలు మలేరియా మందును తమకు కావాలంటూ పోటీపడుతున్నాయి.

తమ దేశానికి పంపించాలంటూ భారతదేశాన్ని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మలేరియా మందు కేవలం భారతదేశంలోనే ఎందుకు దొరుకుతోంది.. కరోనాను ఎంతవరకు నిలువరించగలదు? మన దగ్గర ఎంత మొత్తంలో మందు అందుబాటులో ఉంది.. ఇతరదేశాలకు పంపితే మనకు సరిపోతుందా? మలేరియా మందుతో ఎక్కడైన పరిశోధనలు జరుగుతున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

మానవాళిపై 1928 సంవత్సరం నుంచి మలేరియా మహమ్మారి దాడిచేసింది. ఈ వ్యాధికి దక్షిణ అమెరికాలోని సించోనా అనే చెట్ల బెరడును మందుగా వాడుతుండేవారు. అందుకే దీనిని క్వినైన్ అని పిలుస్తుంటారు. మలేరియా 1930 ఏడాదికి అనేక దేశాలకు వ్యాపించింది. వ్యాధిని నియంత్రించేందుకు మలేరియా మందును భారీగా తయారుచేశారు. ఆ తర్వాత క్లోరోక్విన్‌గా మార్చారు.

ఈ మందుతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు గుర్తించారు. 1950లో మందును మెరుగుపరిచారు. దీనికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని పేరు మార్చారు. ఈ ఔషధాన్ని మలేరియా, కీళ్లనొప్పులు, ఆటో ఇమ్యూన్‌తో వచ్చే లూపస్ వంటి వ్యాధులకు వాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 1980 నుంచే మలేరియా మందు తయారీని నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. 

గ్రామాలు అధికంగా ఉన్న దేశాల్లో మలేరియా వ్యాధులు ఎక్కువగా ఉండటంతో ఈ మందు వాడకం వినియోగంలో ఉంది. భారత్, చైనా దేశాల్లో ఈ మందు భారీగా తయారు చేస్తున్నారు. ప్రపంచంలోని 70శాతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరాలను భారత్ తీరుస్తుంది.

ఈ మందు తయారీకి వాడే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (API- Raw material)ను మాత్రం అత్యధికంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. భారత ఫార్మా కంపెనీలు నెలకు 20 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ట్యాబ్లెట్లు (200 మిల్లీ గ్రాములు)లను ఉత్పత్తి చేయొచ్చు. ఏడాదికి 2.40 కోట్ల ట్యాబ్లెట్లు మన దేశ అవసరాలకు సరిపోతాయి. ప్రస్తుత నేపథ్యంలో ఈ ఉత్పత్తిని 3-4 రెట్లు పెంచుతున్నారు.

కరోనావైరస్ పై  హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఫలితాలు వేర్వేరుగా కనిపిస్తున్నాయి. స్వీడన్‌లో వాడగా ప్రతి 100 మందిలో ఒకరికి గుండె, మూత్రపిండాలపై సైడ్ ఎఫెక్ట్ చూపుతున్నట్లు తేలింది. ఏడాదిలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలకు ఈ మందు ఇవ్వకూడదని ICMR ఆదేశించింది.

కానీ, అమెరికాలో చేసిన పరిశోధనలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఈ మందుపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారతలోనూ సమస్య తీవ్రంగా ఉన్న బాధితులకు అజిత్రోమైసిన్‌తో కలిపి వాడుతున్నారు. చికిత్సలో పాల్గొనే వైద్యులు, సిబ్బందికీ ముందు జాగ్రత్తగా ఈ మందులను ఇస్తున్నారు. 

Also Read | తెలంగాణలో ఐదేళ్ల బాలుడికి కరోనా, గుంటూరులో ఆపరేషన్ చేయించుకుని వచ్చాక గుర్తింపు