Solar Storm Hit Earth: భూమి వైపు దూసుకొస్తున్న భారీ సౌర తుపాను.. సూర్యుడి భారీ విస్ఫోటనంతో ఇస్రో, నాసా అప్రమత్తం

Solar Storm to Hit Earth: సూర్యుడి ఉపరితలంపై సంభవించిన భారీ విస్ఫోటనం (Solar Storm) కారణంగా వెలువడిన ప్లాస్మా మేఘం సోమవారం భూమిని తాకనుంది.

Massive solar storm hitting earth nasa issues gps satellite disruption warning

  • భూమిని తాకనున్న భారీ సౌర తుపాను.
  • ఉపగ్రహాలు జీపీఎస్ వ్యవస్థలపై తాత్కాలిక ప్రభావం.
  • భారత్‌లోనూ ఆరోరా దృశ్యాలు కనిపించే అవకాశం.

Solar Storm: సూర్యుడి ఉపరితలంపై జూన్ 6వ తేదీన సంభవించిన భారీ విస్ఫోటనం(Solar Storm) కారణంగా వెలువడిన ప్లాస్మా మేఘం (కరోనల్ మాస్ ఎజెక్షన్ – CME) సోమవారం భూమిని తాకనుంది. గంటకు 15 లక్షల కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్న ఈ సౌర తుపాను సోమవారం ఉదయం లేదా మధ్యాహ్న సమయానికి భూమిని చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’తో పాటు ప్రపంచవ్యాప్త అంతరిక్ష సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ విస్ఫోటనం భూమి అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపి, తీవ్రమైన అయస్కాంత తుపానుకు (G1 నుండి G4 స్థాయి వరకు) దారితీసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

*Telangana Rains: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

ఈ సౌర తుపాను కారణంగా అంతరిక్షంలోని ఉపగ్రహాలు, భూమిపై రేడియో సంకేతాలు, జీపీఎస్ (GPS) వ్యవస్థల పనితీరుకు తాత్కాలికంగా ఆటంకాలు కలగవచ్చు. గతంలో ఇటువంటి పరిణామాలు విద్యుత్ గ్రిడ్‌లకు, ఉపగ్రహ కమ్యూనికేషన్‌కు నష్టం కలిగించిన దాఖలాలు ఉన్నాయి. సూర్యుడు తన గరిష్ఠ క్రియాశీలక దశలో (Solar Maximum) ఉన్నందున ఈ తరహా విస్ఫోటనాలు జరుగుతున్నాయని, ప్రజలు తమ ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల కాస్త సురక్షితంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కూడా ఈ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత వ్యవస్థలను అప్రమత్తం చేసింది.

మరోవైపు, ఈ సౌర తుపాను ఖగోళ ప్రియులకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని అందించబోతోంది. సాధారణంగా ఉత్తర ధ్రువ దేశాలకే పరిమితమయ్యే రంగురంగుల ‘ఆరోరా’ (ధ్రువ జ్యోతులు) వెలుగులు ఈసారి మరిన్ని ప్రాంతాల్లో ఆకాశంలో ఆవిష్కృతం కానున్నాయి. భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలైన లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎత్తయిన ప్రదేశాలలో కూడా ఈ రంగుల వెలుగులు కనిపించేందుకు స్వల్ప అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలో రాత్రి సమయం తక్కువగా ఉండటం వల్ల దక్షిణ భారతదేశంలో వీటిని చూడటం కష్టమే అయినప్పటికీ, ఉత్తర ప్రాంతాలలో ఆకాశం స్పష్టంగా ఉంటే కెమెరాల ద్వారా ఈ అద్భుతాన్ని బంధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.