Missing Dog Turns Up At Owners Porch At 3 Am And Rings Doorbell To Get In Doorcam Footage Goes Viral
Door Cam Footage: సాధారణంగా, కుక్కలు అప్పుడప్పుడూ తప్పిపోయి రోడ్డుమీద తిరుగుతూ ఉంటాయి. రోజుల తరబడి తప్పిపోయిన కుక్కలు కొన్నిరోజులకు ఇంటికి చేరుకోవడం చూస్తుంటాం. కుక్కలు తప్పిపోయినప్పుడు ఆందోళనతో యజమానులు వెతకడం, ప్రకటనలు ఇవ్వడం అనేకసార్లు చూసే ఉంటాం. తప్పిపోయిన కుక్కలను వెతికి తీసుకుని వచ్చేందుకు కూడా అధికారులు ఉంటారు అమెరికాలో.
అయితే, సౌత్ కరోలినాలో ఓ పెంపుడు కుక్క తప్పిపోయిన చాలారోజుల తర్వాత తనంతట తానే ఇంటికి వచ్చి ఆశ్చర్యకరంగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాలింగ్ బెల్ ఎలా కొడుతామో అలాగే కొట్టింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పెంపుడు జంతువులు తప్పిపోయిన చాలారోజుల తర్వాత తమ ఇళ్లకు తిరిగి వచ్చిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడం కాస్త ఆశ్చర్యకరమే. దాదాపుగా మనుషులు ప్రవర్తించినట్లే ప్రవర్తించిన కుక్క తీరును ఆశ్చర్యంగా చూస్తున్నారు నెటిజన్లు.
23ఏళ్ల మేరీ లైన్ అనే వ్యక్తి కుక్క యజమాని కాగా.. కొద్దిరోజుల క్రితం ఆమె పెంచుకునే కుక్క ఇంటి నుంచి తప్పిపోయింది. అప్పటినుంచి కుక్క కోసం వెతుకుతూనే ఉంది. తన ఫేస్‌బుక్‌లో కూడా కుక్కకు సంబంధించి తప్పిపోయినట్లుగా ఓ పోస్ట్ కూడా పెట్టింది. తన 18నెలల రాజా మిస్ అయ్యిందంటూ ప్రకటన ఇచ్చింది. అంతగా వెతికినా కనిపించని కుక్క రాజా.. ఎవరి సహాయం తీసుకోకుండానే ఒకరోజు రాత్రి 3 గంటలకు లైన్ ఇంటికి రావడమే కాదు.. వాకిలి వద్ద లోపలికి వెళ్ళడానికి డోర్‌బెల్ కూడా మోగించింది.
తెల్లవారుజామున 3 గంటలకు బెల్ మోగగానే అనుమానంతో సీసీటీవీలో ఎవరా? అని చూడగా.. తలుపు దగ్గర కెమెరా ముందు కుక్క కనిపించింది. ఈ ప్రాంతంలో బాణసంచా కాల్చడంతో భయపడి కుక్కు పారిపోయినట్లు చెబుతున్నారు. అయితే, డోర్ బెల్ మోగించడం ఆశ్చర్యంగా అనిపించినట్లుగా సదరు యజమాని చెప్పుకొచ్చారు. మేం ఎప్పుడూ కూడా రాజాకు డోర్‌బెల్ కొట్టడం చూపించలేదని కూడా చెప్పుకొచ్చారు.