School Roof Collapse: కూలిన స్కూల్ పైకప్పు.. 21 మంది పిల్లలు మృతి.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం!
ప్రైవేట్ స్కూల్ పైకప్పు(School Roof Collapse) కూలి ఉపాధ్యాయురాలు, 21 మంది చిన్నారులు దుర్మరణం చెందారు.
- V Santhosh Kumar
- Published on- October 15, 2026 / 01:53 PM IST
Peshawar private school roof collapse teacher and 21 students killed in pakistan
School Roof Collapse: పాకిస్థాన్లోని పెషావర్లో గురువారం దారుణ విషాదం చోటుచేసుకుంది. అఫ్రిది అబాద్లోని ‘అల్ ఖైర్’ ప్రైవేట్ పాఠశాలలో రోజువారీ తరగతులు జరుగుతుండగా, భవనానికి చెందిన కాంక్రీట్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఊహించని ఘోర ప్రమాదంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో(School Roof Collapse) పాటు 21 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు తరగతి గదుల్లో పాఠాలు వింటున్న సమయంలో స్లాబ్ పడటంతో బయటకు తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.
విషమంగా ఐదుగురు చిన్నారుల పరిస్థితి.. ఎమర్జెన్సీ ప్రకటన:
ప్రమాదంలో మరణించిన విద్యార్థుల వయస్సు 7 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారిలో 18 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన 21 మంది విద్యార్థులను సమీపంలోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆసుపత్రి యాజమాన్యం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్య సేవలు వేగవంతం చేసింది.
రంగంలోకి రెస్క్యూ బృందాలు.. గాలింపు చర్యలు ముమ్మరం:
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టాయి. పెషావర్ డిప్యూటీ కమిషనర్ ఆఫాక్ వజీర్ స్వయంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించి పర్యవేక్షించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనన్న అనుమానంతో సహాయక గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
