Humanoid Robot Harassment: ఇలా చేశావేంటి రోబో..! యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన రోబో.. వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్..

Humanoid Robot Harassment : జర్మనీలో 16 ఏళ్ల బాలికను హ్యూమనాయిడ్ రోబోతో వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోబోను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.

Humanoid Robot Sexual Harassment

Humanoid Robot Harassment : జర్మనీలో ఓ హ్యూమనాయిడ్ రోబో 16ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. కొలోన్ నగరంలో అక్టోబర్ 10వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట ఉన్న 16ఏళ్ల బాలిక వద్దకు సుమారు 1.2 మీటర్ల ఎత్తు ఉన్న హ్యూమనాయిడ్ రోబో వచ్చింది. అది బాలికను వెనుక నుంచి తాకి, లైంగికంగా అభ్యంతరకరమైన కదలికలు చేసింది. హగ్ చేసుకొని అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఊహించని ఘటనతో యువతి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

Also Read : Maharashtra : శివ శివా ఇదేం ఘోరం..! పూజ చేసుకునేందుకు వచ్చిన బాలికపై అసభ్యకర ప్రవర్తన.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్

16ఏళ్ల బాలికను రోబోట్ వెనుక భాగంలో తాకినట్లు, ఆమె వైపు అసభ్యకరమైన లైంగిక సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రోబోట్ ను ఇద్దరు యువకులు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో రోబో యాజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల యువకుడు, అతనితో పాటు 19ఏళ్ల మరో యువకుడు కూడా ఘటన సమయంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి కారు డిక్కీలో రోబోను కనుగొన్నారు. అలాగే, వారి మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న హ్యూమనాయిడ్ రోబోను వీధుల్లో వెళ్లే మహిళల దగ్గరకు పంపించి వారిని అసభ్యంగా తాకించడం, అసభ్య సంజ్ఞలు చేయించడంతో పాటు, వాటిని లైవ్‌లో టెలికాస్ట్ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.

ఈ ఘటనలో ప్రధానంగా రెండు అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. రోబో కదలికలు ముందుగానే ప్రోగ్రామ్ చేశారా? లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా యువకులు ఉద్దేశపూర్వకంగా నడిపించారా? అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఇద్దరిపై ప్రస్తుతం అనుమానితులుగా విచారణ జరుగుతోంది. అయితే, తాజాగా ఘటనతో సాంకేతికత వినియోగంపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మనుషుల మాదిరిగా కదిలే రోబోలు వినోదం, సేవలు, పరిశ్రమలు వంటి రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అయితే వాటిని ఇతరులను వేధించడానికి, అవమానించడానికి ఉపయోగిస్తే బాధ్యత ఎవరిది? వాటి కదలికలపై ఎలాంటి భద్రతా నియంత్రణలు ఉండాలి? అనే ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి ముందుకొచ్చాయి.