Attack on Donald Trump: నిందితుడు ఇతడే.. ఫొటో విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్.. గతంలో అవార్డు కూడా అందుకున్నాడు..?

Donald Trump : ట్రంప్ విడుదల చేసిన ఫొటోలో వాషింగ్టన్ హిల్టన్ హోటల్ మెట్ల వద్ద భద్రతా సిబ్బంది అతడిని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఆ చిత్రలో కనిపిస్తోంది. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా చేతులు వెనుకకు కట్టేసి, నేలపై పడి ఉన్నాడు.

Donald Trump

Attack on Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధుల విందులో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్‌కు సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ లో డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోపాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ డిన్నర్ ఈవెంట్‌లో మొత్తం 2600మంది హాజరైయ్యారు. ఈ క్రమంలో ఓ నిందితుడు దూసుకొచ్చి కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ తోపాటు ముఖ్యనేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా.. ట్రంప్ కాల్పులు జరిపిన వ్యక్తి ఫొటోను తన సోషల్ మీడియా ప్లాట్ ఫారం సోషల్ ట్రూత్ ద్వారా విడుదల చేశారు.

Also Read : Donald Trump : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై హత్యాయత్నం.. భయానక పరిస్థితి.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియోలు వైరల్

ట్రంప్ విడుదల చేసిన ఫొటోలో వాషింగ్టన్ హిల్టన్ హోటల్ మెట్ల వద్ద భద్రతా సిబ్బంది అతడిని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఆ చిత్రలో కనిపిస్తోంది. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా చేతులు వెనుకకు కట్టేసి, నేలపై పడి ఉండటం గమనార్హం. అయితే, ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కాల్పులు జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్ గా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అతను తీసుకున్నట్లు సమాచారం.


తాజా ఘటనపై ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అనుమానితుడు పలు ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అడ్డుకున్నారని, ఈ క్రమంలో ఒక అధికారిపై అతడు కాల్పులు జరిపాడు.. సదరు అధికారి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడంటూ ట్రంప్ చెప్పారు. నేను గాయపడిన అధికారితో మాట్లాడాను. అతను క్షేమంగా ఉన్నాడు అని ట్రంప్ పేర్కొన్నారు. నిందితుడు దూసుకొస్తున్న సమయంలో రికార్డు అయిన వీడియోను కూడా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ ట్రూత్ లో పోస్టు చేశారు.

వాషింగ్టన్ డీసీ పోలీస్ కమిషనర్ జెఫ్రీ డబ్ల్యూ కారోల్ మాట్లాడుతూ.. డిన్నర్ వద్ద సీక్రెట్ సర్వీసెస్ బృందం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద ఓ దుండగుడు షాట్ గన్, పలు కత్తులతో లోపలికి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు స్వల్పంగా గాయమైంది. నిందితుడిని 31ఏళ్ల కోలో టామోస్ అలెన్ అనే టీచర్‌గా గుర్తించాం. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను నివాసం ఉండే అపార్టుమెంట్‌ను కూడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్స్ ఆధీనంలోకి తీసుకొని సోదాలు చేసినట్లు కారోల్ తెలిపారు.