Iran Gulf Blackout : ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్… ఘాటుగా స్పందించిన ఇరాన్.. గల్ఫ్ దేశాల్లో వాటర్, పవర్ ప్లాంట్లపై దాడికి స్కెచ్..!
Iran Gulf Blackout : టంప్ 48 గంటల అల్టిమేటంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అందుకు ప్రతీకారంగా తాము గల్ఫ్ దేశాలను బ్లాక్ అవుట్ చేస్తానని ప్రకటించింది.
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 07:05 PM IST
Trumps 48 Hour Hormuz Ultimatum Iran Warns to Blackout Gulf countries
Iran Gulf Blackout : ఇరాన్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవాలి, లేదంటే ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అల్టిమేటంపై ఇరాన్ ధీటుగా స్పందించింది. అమెరికా వార్నింగ్‌కు భయపడేది లేదని.. ఒకవేళ యూఎస్ గనుక ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తే, అందుకు బదులుగా తాము గల్ఫ్ దేశాల్లో (GCC) ‘బ్లాక్ అవుట్’ (విద్యుత్ నిలిపివేత) చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అక్కడి విద్యుత్ కేంద్రాలు, మంచినీటి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ తన వద్ద ఉన్న షహాబ్-3, ఇమాద్, ఫతే-313 క్షిపణులను, భారీ స్థాయిలో షాహెద్ తరహా డ్రోన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇవి 200 నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవని నిపుణులు పేర్కొంటున్నారు.
మధ్య ప్రాచ్య దేశాలపై ప్రభావం:
దుబాయ్ వంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ఇక్కడి ఇంధన, విద్యుత్ రంగాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చెప్పినట్లుగానే ఇరాన్ గనుక దాడులు చేస్తే, ఈ ప్రాంతంలో ప్రాణనష్టంతో పాటు ఊహించలేని స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లోని పలు తీర ప్రాంత విద్యుత్ కేంద్రాలను చూపిస్తూ ఉపగ్రహ మ్యాప్స్ విడుదలయ్యాయి. వీటిలో ఖతార్‌లోని రాస్ లాఫాన్ నార్త్, దుబాయ్‌లో జెబెల్ అలీ సౌత్, కువైట్‌లో అల్ జూర్ నార్త్ అండ్ సౌత్, సౌదీ అరేబియా ఈస్ట్రన్ ప్రావిన్స్‌లోని కేంద్రాలు, అలాగే బహ్రెయిన్, షార్జాలోని ప్రదేశాలు ఉన్నాయి.
గతంలో ఇరాన్ దాడుల వల్ల.. రాస్ లాఫాన్ వంటి గల్ఫ్ ఎనర్జీ కేంద్రాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించడమే కాక, ఎల్ఎన్జీ (LNG) సరఫరాలో అంతరాయం ఏర్పడి విద్యుత్ సమస్యలను సృష్టించాయి. ఈ ప్లాంట్లు తాగునీటి కోసం ఉపయోగించే డీసాలినేషన్ (Desalination) వ్యవస్థలతో అనుసంధానమై ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో దాదాపు 80 శాతం తాగునీటిని సరఫరా చేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఒమాన్, యూఏఈ వంటి దేశాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాలు ఎక్కువగా ఒకే తీర ప్రాంతాలపై ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ గనుక వీటిపై దాడి చేస్తే.. దుబాయ్, దోహా, రియాద్, కువైట్ సిటీ వంటి ప్రధాన నగరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే చమురు ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
