Uganda Ebola Cases : ఉగాండాలో ఎబోలా అంతం.. ఒక్క కేసు కూడా లేదు.. కానీ కాంగోలో ఆగని విజృంభణ!
Uganda Ebola Cases : ఎబోలా వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చిన ఉగాండా తన దేశాన్ని ఎబోలా రహిత దేశంగా ప్రకటించుకుంది. కాంగో వేగంగా తీవ్రమవుతున్న మహమ్మారితో పోరాడుతోంది.
Uganda Ebola Cases
- ఉగాండా ఎబోలా ఫ్రీ.. 42 రోజుల తర్వాత ఒక్క కేసు నమోదు కాలేదు
- ఎబోలా రహిత దేశంగా ప్రకటించుకున్న ఉగాండా
- కాంగోను ఇంకా వెంటాడుతున్న వైరస్
- కాంగోలో 3,262 ఎబోలా కేసులు, 1,437 మంది మృతి
Uganda Ebola Cases : ఎబోలా వైరస్ నుంచి ఉగాండా ఊపిరిపీల్చుకుంది. ఎబోలా వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడంలో విజయం సాధించింది. దాంతో ఎబోలా రహిత దేశంగా ఉగాండా ప్రకటించుకుంది. చివరి ఎబోలా రోగి కోలుకుని డిశ్చార్జ్ అయిన 42 రోజుల తర్వాత దేశంలో ఒక్క కొత్త కూడా కేసు కూడా నమోదు కాలేదు.
ఫలితంగా అధికారికంగా తమను “ఎబోలా రహిత దేశం”గా పేర్కొంది. అయితే, ఇదే సమయంలో పక్క ప్రాంతమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రాంతీయంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది నమోదైన ఎబోలా వ్యాప్తి పూర్తిగా కాంగో నుంచి వచ్చిన కేసులే కారణమని వెల్లడైంది. ఎబోలా తమకు ఉందని తెలియకముందే చికిత్స కోసం సరిహద్దు దాటి వచ్చిన కాంగో పౌరుల ద్వారా తొలి కేసులు వెలుగుచూశాయి. అనంతరం బాధితులను కలిసిన వారందరినీ క్వారంటైన్లో ఉంచి, 21 రోజుల పాటు పర్యవేక్షించారు. ఎలాంటి కొత్త కమ్యూనిటీ వ్యాప్తి కనిపించకపోవడంతో వ్యాప్తి ముగిసినట్లుగా ప్రకటించారు.
ఈ వైరస్ వ్యాప్తికి బండిబుగ్యో రకం అనే ఎబోలా వైరస్ అసలు కారణం కాగా దీనికి అధికారిక టీకా లేదా ప్రత్యేక ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. దాంతో ఉగాండా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సరిహద్దు నియంత్రణలు కఠినతరం చేసింది.
Read Also : Sonam Wangchuk : విజయంతో పాటు వినయం కూడా ఉండాలి : సీజీపీ సంబరాలపై సోనమ్ వాంగ్చుక్ హితవు!
అలాగే కాంగోతో ప్రజా రవాణా, విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. అక్కడితో ఆగకుండా వేలాది మంది పాల్గొనే వార్షిక మతపరమైన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసింది. ప్రజలందరూ దూరంగా ఉండాలని సూచించింది.
మరోవైపు కాంగోలో పరిస్థితి మహాప్రళయంగా మారింది. ఇప్పటివరకు అక్కడ 3,262 ఎబోలా కేసులు నమోదయ్యాయి. 1,437 మంది మృతిచెందారు. కేవలం 10 వారాల్లోనే ఎబోలా తీవ్రవ్యాప్తితో దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎబోలా మహమ్మారిగా మారిపోయింది. భద్రతా సమస్యల కారణంగా వైద్య బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఎబోలా వైరస్ అనేది సోకిన వ్యక్తి శరీరం ద్వారా లేదా వారు వాడిన కలుషిత వస్తువులను వినియోగించడం ద్వారా వ్యాపించవచ్చు. అందుకే బాధితులను త్వరగా గుర్తించి వేరుచేయాలి. కాంటాక్టులను క్వారంటైన్ చేయడం చేయాలి. అప్పుడే వ్యాప్తిని అరికట్టగలరు. ఎబోలాపై ఉగాండా విజయం సాధించినా కాంగోలో కొనసాగుతున్న ఉధృతి మధ్య తూర్పు ఆఫ్రికా ఇంకా అప్రమత్తంగానే ఉండక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
