Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 50మందికిపైగా మృతి.. మృతుల్లో 40మంది చిన్నారులే.. ఒక్క నిమిషంలోనే విషాదం..
Nigeria Boat Accident : నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50మందికిపైగా మృతి చెందగా.. ఇందులో 40మంది చిన్నారులే ఉన్నారు.
Nigeria Boat Accident
Nigeria Boat Accident : నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వాయువ్య ప్రాంతమైన సోకోటో రాష్ట్రంలోని గొరౌ ప్రాంతంలో వ్యవసాయ పనుల నిమిత్తం పడవలో నది దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో ప్రయాణం ప్రారంభమైన నిమిషానికే అదుపుతప్పి పడవ నీటిలో మునిగిపోయింది. దీంతో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Sarita Komatireddy : తెలుగు మహిళకు ట్రంప్ సపోర్టు.. ఎవరీ సరిత కోమటిరెడ్డి? అమెరికాలో టాప్ రేసులో..!
ప్రమాదం సమయంలో పడవలో 70మంది ప్రయాణికులు ఉన్నారని.. మృతుల్లో 40మంది వరకు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకిదిగి నీటిలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారు.
నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (NEMA), నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఏరియా మేనేజర్ అబ్దుల్ ఖాదిర్ యూసుఫ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ఈ దారుణమైన ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 40 మందికిపైగా చిన్నారుల మృతదేహాలను వెలికి తీశామని తెలిపారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
నైజీరియాలో నదులు, జలమార్గాల్లో పడవ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దేశంలో రోడ్లు సరిగ్గా లేని కారణంగా ఎక్కువగా నీటి మార్గం ద్వారానే ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇలాంటి ప్రమాదాలు ఆ దేశంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పడవ ప్రమాదంలో 25మందికిపైగా మరణించారు. గతేడాది నవంబర్ నెలలో జరిగిన ప్రమాదంలో 27మంది మృతి చెందారు. పడవల నిర్వహణ సరిగా లేకపోవటం, భద్రతా నిబంధనలు అమలు లోపించడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
