Haryana : భర్తలను వదిలేసి.. పిల్లలను తీసుకొని ఇద్దరు మహిళలు జంప్.. వాట్సాప్ చాట్స్‌లో సంచలన విషయాలు.. అసలేం జరిగిందంటే?
Two Womens Missing With Children In Haryana : హరియాణా గురుగ్రామ్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వివాహిత మహిళలు తమ పిల్లలను తీసుకొని భర్తలను వదిలేసి వెళ్లారు. పోలీసులు ఇద్దరు మహిళల వాట్సాప్ మెస్సేజ్ లు చెక్ చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Two womens missing with children in Haryana
Two Womens Missing With Children In Haryana : హరియాణా గురుగ్రామ్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు వివాహిత మహిళలు తమ నలుగురు పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు. అంతేకాదు.. వారి ఇళ్ల నుంచి సుమారు రూ.9లక్షల విలువైన బంగారు నగలు, నగదు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, మహిళల ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించిన భర్తలు సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ పరస్పరం ప్రేమలో ఉన్నారని, చివరకు ఒకరినొకరు వివాహం చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read : Palawan Ferry Accident : ఘోర ప్రమాదం.. నడి సముద్రంలో పడవలో మంటలు.. పలువురు మృతి, 87మంది ఆచూకీ గల్లంతు..
ఫరీదాబాద్ సమీపంలోని బల్లభ్‌గఢ్‌కు చెందిన మంజు (25)కు 2020లో పల్వాల్‌కు చెందిన సన్నీతో వివాహం జరిగింది. అదే ఏడాది ఆమె చిన్ననాటి స్నేహితురాలు రీనాకు కూడా వివాహమైంది. రీనా భర్త వేద్‌పాల్ గురుగ్రామ్‌లోని పటౌడీ ప్రాంతానికి వ్యక్తి. ఆగస్టు 21న మంజు తన నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వెంట సుమారు రూ.4 లక్షల విలువైన నగలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మంజు కోసం వెతుకుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు రీనా కుటుంబాన్ని సంప్రదించగా.. రీనా కూడా కనిపించడం లేదని తెలిసింది. ఆమె తన నాలుగేళ్ల కుమార్తె, ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి అదృశ్యమైనట్లు తేలింది. ఆమె వెంట సుమారు రూ.5 లక్షల విలువైన నగలు, నగదు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాట్సాప్ చాట్స్‌తో అనుమానాలు..
ఇద్దరు మహిళలు ఒకేసారి పిల్లలతో కలిసి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వారి ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన కొన్ని వ్యక్తిగత సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. వాట్సాప్‌లో వారు ఒకరినొకరు “మై క్యూట్ వైఫ్”, “మై లవ్”, “బాబు” వంటి పదాలతో సంబోధించుకున్నట్లు వారి భర్తలు తెలిపారు. ఇద్దరూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులని, 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని చెప్పారు. గతంలో వారి తరచూ మాట్లాడుకోవడాన్ని చిన్ననాటి స్నేహంగా మాత్రమే భావించామని, తాజాగా బయటపడిన చాట్స్ నేపథ్యంలో ఇద్దరి మధ్య సుమారు ఏడాదిన్నరగా ప్రేమ సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు భర్తలు పేర్కొన్నారు.
వాట్సాప్ సంభాషణల ఆధారంగా ఇద్దరు మహిళలు పరస్పరం వివాహం చేసుకుని ఉండొచ్చని వారి భర్తలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇద్దరు మహిళలు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే, తమ నలుగురు పిల్లలను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని భర్తలు పోలీసులను కోరినట్లు తెలిసింది. మహిళలు, వారి నలుగురు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మొబైల్ ఫోన్ లొకేషన్లు, ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించి వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
