Meta Law Suit: సోషల్ మీడియా బానిసత్వంపై ఫైట్.. మెటాకు రూ.19 లక్షల కోట్ల ఫైన్.. మార్క్ జుకర్‌బర్గ్‌కు కోర్టు సమన్లు?
అమెరికాలో సోషల్ మీడియా(Meta Law Suit) బానిసత్వంపై తీవ్ర స్థాయిలో చట్టపరమైన పోరాటం మొదలైంది.
Meta faces 200 billion dollar lawsuit in us over social media addiction in teens
- మెటాపై అమెరికా రాష్ట్రాల దావా
- పిల్లల్లో సోషల్ మీడియా బానిసత్వం
- పంతొమ్మిది లక్షల కోట్ల నష్టపరిహారం
Meta Law Suit: అమెరికాలో సోషల్ మీడియా బానిసత్వంపై తీవ్ర స్థాయిలో చట్టపరమైన పోరాటం మొదలైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో టీనేజర్లు, చిన్నపిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నారంటూ మెటా సంస్థపై అమెరికాలోని 29 రాష్ట్రాలు ఉమ్మడిగా ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో భారీ దావా వేశాయి. గతంలో పొగాకు రంగానికి ఎదురైన తీవ్ర పరిణామాల తరహాలోనే ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజాలకు కష్టకాలం మొదలైందని విశ్లేషకులు భావిస్తుండటంతో, ఈ పరిణామాన్ని అమెరికాలో రెండో ‘బిగ్ టొబాకో’ మూమెంట్‌గా వర్ణిస్తున్నారు.
యూజర్ల డేటా సేకరణ, మాదకద్రవ్యంతో ఇన్స్టాగ్రామ్ పోలిక:
యూజర్లు వీలైనంత ఎక్కువ సమయం యాప్‌లలో గడిపేలా డిజైన్ చేయడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటాను సేకరించి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయడం అమెరికా చట్టాలకు వ్యతిరేకమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనెయిల్ ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌ను మెటా సొంత ఉద్యోగులే ఒక మాదకద్రవ్యంతో పోల్చిన చాట్లను కోర్టులో చూపించారు. ఎంత చిన్న వయసులో పిల్లలు యాప్‌ను వాడటం ప్రారంభిస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని మెటా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పిటిషన్ పేర్కొంది.
మార్క్ జుకర్‌బర్గ్ విచారణ.. రూ. 19 లక్షల కోట్ల పరిహారం ప్రమాదం:
ఆరు వారాల పాటు సాగే ఈ విచారణలో మెటా అధినేతి మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో మెటా(Meta Law Suit) ఓడిపోతే ఏకంగా 200 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 19 లక్షల కోట్ల వరకు నష్టపరిహారంగా చెల్లించాల్సి రావచ్చు. అయితే ఈ ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. కేవలం పరిహారం వసూలు చేయడానికే అటార్నీ జనరళ్లు ఈ దావా వేశారని, పిల్లల భద్రతకు తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
