పాకిస్థాన్ రాజ్యాంగంలో సవరణలు.. ఐక్యరాజ్య సమితి వార్నింగ్.. ప్రమాదం పొంచి ఉందా?
ఈ మార్పులు న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం, కార్యనిర్వాహక నియంత్రణ పెరిగేలా చేస్తున్నాయని తెలిపారు.
- T Venkateshwarlu
- Updated on- November 30, 2025 / 03:20 PM IST
Pakistan: పాకిస్థాన్ రాజ్యాంగంలో సవరణలు చేస్తూ ఆ దేశ పార్లమెంటు తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి వార్నింగ్ ఇచ్చింది. పాక్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌కు అనేక అధికారాలు ఇస్తూ, జీవితాంతం అరెస్ట్, ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఇచ్చే తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
అలాగే, మునీర్‌కు సీడీఎఫ్ పదవిని ఇచ్చింది. 27వ రాజ్యాంగ సవరణ చేసింది. దీంతో పాక్ అత్యున్నత న్యాయస్థానాల పని విధానాల్లోనూ ముఖ్యమైన మార్పులు వచ్చాయి. వీటిపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం స్పందించింది.
పాక్ నిర్ణయం అనేక రంగాలపై, సుదీర్ఘ కాలం పాటు, విస్తృతంగా ప్రభావం చూపుతుందని చెప్పింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగ కమిషనర్ వోల్కర్ టర్క్ దీనిపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ రాజ్యాంగ సవరణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు.
పాక్‌లో గతంలో జరిగిన 26వ సవరణలాగానే ప్రస్తుతం జరిగిన 27వ సవరణను కూడా న్యాయవర్గం, పాకిస్థాన్ ప్రజలతో చర్చలు లేకుండా ఆమోదించారని అన్నారు.
సైనిక వ్యవస్థ జవాబుదారీతనం, చట్టపాలనపై ఆందోళనలను పెంచుతున్నాయని చెప్పారు. ఈ మార్పులు న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం, కార్యనిర్వాహక నియంత్రణ పెరిగేలా చేస్తున్నాయని తెలిపారు.
పాకిస్థాన్ నవంబర్ 13న ఈ కొత్త సవరణలకు ఆమోదం తెలిపింది. దీంతో రాజ్యాంగానికి సంబంధించిన కేసులపై అధికారాలు కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టుకు అప్పగిస్తారు. దీంతో సుప్రీంకోర్టు అధికారాలు తగ్గాయి. ఇప్పుడు పాక్ సుప్రీంకోర్టు పౌర క్రిమినల్ కేసులకే పరిమితం అయింది.
పాకిస్థాన్‌లో సైన్యం ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన దశలోకి వచ్చింది. సైన్యాధిపతి ఆసీం మునీర్ ఇప్పటికే ఆ దేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్)గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో త్రివిధ దళాల పూర్తి నియంత్రణ పాక్ అధ్యక్షుడు, క్యాబినెట్ నుంచి సీడీఎఫ్ చేతుల్లోకి వెళ్లింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు.
