US Blocks Strait of Hormuz : హర్మూజ్ దిగ్బంధనం.. ఇండియాలో తగ్గిపోతున్న చమురు నిల్వలు.. ఇక సామాన్యులు బతకడం కష్టమే..!
US Blocks Strait of Hormuz : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జల సంధిని దిగ్బంధనం చేస్తానని ప్రకటించారు. ఇదే జరిగితే ఆ ప్రభావం భారత్ పై ఎంతలా ఉండబోతుందో ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
- Dharani Pilli
- Updated on- April 14, 2026 / 03:25 PM IST
US blockade of Strait of Hormuz begins how it impact india and bills may increase
- అమెరికా హర్మూజ్ దిగ్భందనంతో
- ఇండియాపై తీవ్ర ప్రభావం
- గ్యాస్, ఇంధనం, కాయకూరల ధరలు భారీగా పెంపు
US Blocks Strait of Hormuz : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని, అవసరమైతే ఇరాన్ పోర్టులపై బ్లాకేడ్ అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలతో పాటు ఇండియాను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
హర్మూజ్ జలసంధిని మూసివేస్తే ఇండియాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి? ప్రస్తుతం దేశంలో చమురు నిల్వలు ఎన్ని రోజులకు సరిపడా ఉన్నాయి? హర్మూజ్ జలసంధిని మూసివేస్తే ఇండియాలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, గ్యాస్ సిలిండర్ నిల్వలు వంటివి ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నాయి అనే దానిపై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. వారు చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం న్యూఢిల్లీ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ (SPR) వద్ద కేవలం సుమారు 9.5 రోజులకే సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయంటున్నారు. ఇక రిఫైనరీల వద్ద 10–12 రోజుల ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. రాజకీయ కారణాల వల్ల ఇప్పటికే దేశీయంగా డీజిల్, పెట్రోల్ ధరలను పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
*అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. కారణమెవరు?
భారత్ తన ఇంధన అవసరాలలో సుమారు 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ మొత్తంలో సగానికి పైగా, అంటే సుమారు 45 శాతం ఇంధనం హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తే, ధరల పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఇండియాకు అమెరికా, ఇరాన్‌లతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ పరిస్థితుల్లో సమస్యలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. హర్మూజ్ జలసంధిలో మైన్లు అమర్చినట్లు ఇరాన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో వాణిజ్య రవాణా దాదాపు నిలిచిపోయింది.
*వారం రోజుల్లో చమురు ధరలు భారీగా పెరుగుతాయ్.. కారణాలివే.. అమెరికా ఇంధన శాఖ మంత్రి హెచ్చరిక
ఇప్పటికే ఇండియాలో తీవ్రమైన ఎల్పీజీ కొరత ఉంది. ముడి చమురుతో పోలిస్తే గ్యాస్‌కు సరైన నిల్వలు లేవు. దీంతో ఇండియాలో కొన్ని రోజుల క్రితమే గ్యాస్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇండియా ఇప్పటికే రష్యా నుంచి రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెల్స్ చమురు కొనుగోలు చేస్తోంది. అమెరికా నుంచి మినహాయింపులు పొందేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 104 డాలర్లకు చేరడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 0.25 శాతం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 94 స్థాయికి పడిపోయింది. దీంతో ఎలక్ట్రానిక్స్, యంత్రాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరిగాయి.
