US End Iran War : ప్రపంచ దేశాలకు భారీ ఊరట.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..

US End Iran War : గత ఐదు వారాలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ముగియబోతుంది

US may end Iran war said Hormuz may not be a priority

  • అమెరికా-ఇరాన్ యుద్ధంపై కీలక అప్డేట్
  • యుద్ధం ముగింపు దిశగా ట్రంప్ ప్రకటన
  • హార్ముజ్ జలసంధి తెరకున్నా పర్వాలేదు

US End Iran War : ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ప్రారంభమైన యుద్ధం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫిబ్రవరి 28వ తేదీన ముందుగా.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. ఆ తర్వాత.. ఇరాన్ ప్రతి దాడితో గల్ఫ్ ప్రాంతాన్ని ఉద్రిక్తతలు చుట్టేశాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. మరీ ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో వందల సంఖ్యలో చమురు నౌకలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఇండియా సహా పలు దేశాల్లో ఇంధన కొరత, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. హోటల్స్, రెస్టారెంట్లు మొదలు సామాన్యులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఓ చల్లటి వార్త తెర మీదకు వచ్చింది. ఇరాన్‌తో యుద్ధాన్ని అంటే ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన సన్నిహితులతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచినా.. తెరవకపోయినా.. ఆ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇది ప్రపంచ దేశాలకు భారీ ఊరట కలిగించనుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు మరో సందర్భంలో ఒత్తిడి చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆ కథనంలో వెల్లడించారు. ఇరాన్‌పై ఆపరేషన్‌ను కేవలం నాలుగు నుంచి ఆరు వారాల వరకు మాత్రమే అంచనా వేసి అమెరికా దాడులకు దిగింది. ఒకవేళ జలసంధి అంశంలో సందిగ్ధత కొనసాగితే యుద్ధం ముగింపు మరింత ఆలస్యం అవుతుందని, దీని వల్ల ఇచ్చిన గడువు కూడా దాటినట్లు అవుతుందని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ నేవీని దెబ్బతీయడం, క్షిపణి నిల్వలను పేల్చివేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలని ట్రంప్ నిర్ణయించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇరాన్ యుద్ధ భారాన్ని అరబ్ దేశాలు కూడా పంచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు లివియట్ తెలిపారు. ఆ సంగతి అలా ఉంచితే హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకల వద్ద టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ టోల్ టాక్స్ బిల్లుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ నుంచి ఆమోదం దక్కినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొన్నది. పన్ను వసూలు చేయడానికి అనుమతి లభించిందని.. జాతీయ భద్రతా కమిషన్ సభ్యుడు ఒకరు వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఒమన్ దేశ సాయంతో ఇరాన్.. హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై పన్ను విధింపు ప్రక్రియను అమలు చేయనున్నది.