Iran vs Israel War : ఫోన్‌చేసి మరీ ఇజ్రాయెల్ ప్రధానిపై మండిపడ్డ జేడీ వాన్స్..! అసలేం ఏం జరిగిందంటే?
Iran vs Israel War : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాకు ఫోన్ చేసి మరీ మండిపడినట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక పేర్కొంది.
- Harishth Thanniru
- Published On : March 28, 2026 / 01:10 PM IST
JD Vance Benjamin Netanyahu
- నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్
- గతంలో ఇచ్చిన హామీలు తప్పని మండిపడ్డ వాన్స్
- నెతన్యాహు దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం
Iran vs Israel War : పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు ఉగ్రరూపందాల్చుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇరాన్ మాత్రం.. అసలు మేము చర్చలు జరపడం లేదని తేల్చి చెప్పింది. తమ డిమాండ్లు నెరవేర్చకుండా యుద్ధాన్ని ముగించే అవకాశమే లేదని పేర్కొంది. దీంతో యుద్ధం మరికొద్దిరోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌ను చాలా తక్కువ అంచనా వేశాయి. ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించడం ద్వారా, ఆ దేశంలోని అగ్రనేతలను మట్టుపెట్టడం ద్వారా ఇరాన్ మోకరెళ్లుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భావించాడనేది కాదనలేని వాస్తవం. కానీ, యుద్ధం జరుగుతున్నా కొద్దీ ఇరాన్ వ్యూహాలకు అమెరికా, ఇజ్రాయెల్ సైతం ఆశ్చర్యపోతున్నాయి. తాజాగా ఈ విషయంపైనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాకు ఫోన్ చేసి మరీ మండిపడినట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక పేర్కొంది.
ఇజ్రాయెల్ ప్రధానికి చేసిన ఫోన్ కాల్‌లో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలడం చాలా సులభమని, యుద్ధం త్వరగా ముగుస్తుందని నెతన్యాహు గతంలో ఇచ్చిన హామీలను జేడీ వాన్స్ ప్రస్తావించినట్లు తెలిసింది. ఇరాన్ బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయారని నెతన్యాహుపై వాన్స్ సీరియస్ అయ్యారని కథనం పేర్కొంది.
నెతన్యాహుతో ఫోన్ కాల్ తరువాత ఇస్లామిక్ రిపబ్లిక్ తో కాల్పుల విరమణ చర్చల్లో కీలక పాత్రపోషిస్తున్న వాన్స్ ను ఇజ్రాయెల్ బలహీనపరుస్తోందని ఒక అమెరికా అధికారి ఆరోపించాడు. ఇరాన్ ప్రతినిధులు వాన్స్ తో చర్చలకే మొగ్గుచూపుతున్నారని వస్తున్న వార్తలు వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందని, వాన్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమని తెలిపారు.
సాధారణంగా జేడీ వాన్స్ విదేశీ యుద్ధాల్లో అమెరికా పాత్రపై వ్యతిరేకంగా ఉంటారు. ప్రస్తుతం ఇరాన్ తో జరిగే యుద్ధంలోనూ వాన్స్ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని చెబుతున్నారు. గతంలో యుద్ధాల విషయంలో అమెరికా చేసిన తప్పులు పునరావృతం కాకూడదని వాన్స్ పట్టుబడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ తో యుద్ధాన్ని త్వరగా ముగించాలని, అందుకే నెతన్యాహు దూకుడుకు కళ్లెం వేసేందుకు వాన్స్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
