Representative Image (Image Credit To Original Source)
Lahore High Court: పాకిస్తాన్ లోని చరిత్రాత్మక లాహోర్ హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాయర్లు ఘోరంగా కొట్టుకున్నారు. పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. లాహోర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఈ గొడవకు దారితీశాయి.
లాహోర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ (LHCBA) ఎన్నికల ఫలితాలు ఘర్షణకు కారణమయ్యాయి. లాహోర్ హైకోర్టు లోపల హింస చెలరేగింది. గందరగోళ పరిస్థితులు కనిపించాయి. పోల్ ఫలితాలపై భిన్నాభిప్రాయాల కారణంగా ఈ ఘర్షణ తలెత్తింది. లాయర్లు రెండు వర్గాలు విడిపోయారు. గొడవ పడ్డారు. రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఓ వర్గం వారు ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు. దీంతో విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాదనలు జరిగాయి. ఈ వాదనలు శ్రుతి మించి ఘర్షణకు దారితీశాయి. లాయర్లు కొట్టుకునే వరకు వెళ్లింది. కొట్టుకోవడం అంటే అలా ఇలా కాదు.. పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఓ పురుష లాయర్ మరో మహిళా లాయర్ ను చితక్కొట్టాడు. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు.
కాగా, ఫలితాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు పాకిస్తాన్ బార్ కౌన్సిల్ కింద ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి రెండు వర్గాలు అంగీకరించాయి. అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే కొత్తగా ఎన్నికలు జరిపి వచ్చే ఫలితాలను అంగీకరిస్తామని ఇరు వర్గాలు ప్రతిజ్ఞ చేశాయి.
లాయర్ల ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన లాయర్లే ఇలా కొట్టుకోవడం ఏంటని అంతా విస్తుపోతున్నారు. వీళ్లు న్యాయవాదులా? వీధి రౌడీలా? అని తిట్టిపోస్తున్నారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని అత్యున్నత న్యాయ సంస్థలలో ఒకదానిలో క్రమశిక్షణ, భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తింది. కాగా, పాకిస్తాన్ లో అంతే.. అక్కడ పాలకులే కాదు.. లాయర్లు కూడా తేడానే అని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. న్యాయం కోసం పోరాటం చేయాల్సిన న్యాయవాదులు.. ఇలా వీధి రౌడీల్లా పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.
Also Read: మరోసారి తెరపైకి బాబా వంగా జోస్యం.. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా.. న్యూక్లియర్ వార్ తప్పదా..?