Donald Trump : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై హత్యాయత్నం.. భయానక పరిస్థితి.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియోలు వైరల్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. వైట్‌హౌస్ వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
- Harish Thanniru
- Updated on- April 26, 2026 / 07:44 AM IST
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. వైట్‌హౌస్ వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వైట్‌హౌస్‌కు సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ డిన్నర్‌లో డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోపాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ డిన్నర్ ఈవెంట్ కు దాదాపు 2600 మంది హాజరైనట్లు సమాచారం.
డిన్నర్ జరుగుతున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లతోపాటు మరికొందరు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఊహించని ఈ ఘటనతో ఈవెంట్‌లో పాల్గొన్న వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు భయంతో వణికిపోయారు.
అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడక పోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కాగా.. దుండగుడు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు సీఐఏ అధికారులు గుర్తించారు. అనంతరం భద్రతా బలగాలు హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద జరిగిన కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం సోషల్ ట్రూత్‌లో పోస్టు చేశారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పనిచేశారని అన్నారు. వేగంగా, ధైర్యంగా స్పందించి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అని నేను సిఫార్సు చేశాను. కానీ, ఇది పూర్తిగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకత్వంలోనే జరుగుతుంది. వారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయంతో సంబంధం లేకుండా, ఈ సాయంత్రం అనుకున్నదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. మనం దీన్ని మళ్లి నిర్వహించాల్సిందే అని ట్రంప్ పేర్కొన్నారు.
