Cyclone Tauktae: మహారాష్ట్రకు మరో ఉపద్రవం.. తౌటే తుఫాను అలెర్ట్!

ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నుంచి బయటపడడానికి మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందనుకుంటున్న సమయంలో ఊహించని విపత్తులా..

Cyclone Tauktae: ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నుంచి బయటపడడానికి మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందనుకుంటున్న సమయంలో ఊహించని విపత్తులా మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు Tauktae Cyclone మహారాష్ట్రను వణికిస్తుంది. తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుండే పలుప్రాంతాలలో వర్షాలు మొదలవగా వాతావరణశాఖ పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేస్తుంది.

ముఖ్యంగా ముంబై మహా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలతో ముందుగానే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం.. కరోనా రోగులున్న ఆసుపత్రులపై దృష్టి సారించింది. కరోనా పేషేంట్లకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ఫీల్డ్ ఆసుపత్రుల నుండి 580 మంది రోగులను తరలించింది. కోవిడ్ రోగుల కోసం నిర్మించిన తాత్కాలిక ఆసుపత్రులకు కూడా ముప్పు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ముంబై సముద్రతీరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరం నుంచి ఈ Tauktae Cyclone గుజరాత్‌ దిశగా ముందుకుసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపగా.. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడనుందని హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో అధికారులు అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో అలర్ట్‌ను జారీ చేశారు. కొంకణ్‌, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, సింధుదుర్గా, రత్నగిరి, సాతారా, సాంగ్లీ, కోల్హపూర్‌, ముంబై, థానే, పాల్ఘర్, రాయిగడ్, పుణేలున్నాయి. గతంలో నిసర్గ తుఫాన్ రాష్ట్రంలోనే తీరం దాటడంతో విలయతాండవం సృష్టించగా ఇప్పటికీ ప్రజలలో ఆ భయాందోళనలు కనిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు