Cm Kcr
CM KCR: తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు అధికారులు, పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఆసుపత్రులలో బెడ్స్ కూడా అందుబాటులోకి వచ్చేంతగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చు. అయితే.. రాష్ట్రంలో లాక్ డౌన్ ఫలితాలను ఇస్తుందా లేదా.. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏంటన్న దానిపై సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి స్థానిక వివరాలను కనుకుంటున్నారట.
ఈనెల 30న మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై మరికాస్త నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నేటి నుంచే సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ మొదలు పెట్టారు. క్యాబినెట్ సమావేశం అనంతరం పలు విధానాలపై నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. సమావేశం ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తెలుసుకోనున్న సీఎం.. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల వారీగా ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం స్వయంగా ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిణామాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. పాత ఉమ్మడి జిల్లాల నుండి నూతన జిల్లాల వరకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తున్న సీఎం మీ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపింది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులను ఎలా చూస్తున్నారు? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను సీఎం అడుగుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం తీసుకుంటున్న ఫీడ్ బ్యాక్ తో పాటు వైద్య అధికారుల అభిప్రాయాలను తీసుకొని తదుపరి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తుంది.