Cycle girl జ్యోతికి IIT Coaching

  • Publish Date - May 28, 2020 / 08:53 AM IST

లాక్ డౌన్ విధించిన సమయంలో…తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన జ్యోతి కుమారి సైకిల్ గర్ల్ గా గుర్తింపు పొందింది. ఈమె చేసిన సాహసానికి ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ స్పందించారు. జ్యోతిని అభినందిస్తున్నట్లు, ఆమెకు ఉచితంగా IIT – JEE కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కి 1200 కిలో మీటర్లు ప్రయాణించడం పెద్ద సాహసమేనన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిందన్నారు. సూపర్ 30 స్వాగతం పలుకుతుందని ఆనంద్ కుమార్ ట్వీట్ లో తెలిపారు. తన తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించడం జరిగిందన్నారు. బీహార్‌లోని దర్భాంగకు చెందిన మోహన్ పాశ్వాన్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కూతురు జ్యోతి కుమారితో కలిసి కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. అక్కడ రిక్షా తొక్కుతూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో కరోనా రావడంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉపాధికి దెబ్బ తగిలింది.

కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని వెనక్కి తీసుకున్నాడు. వీరు ఉంటున్న గది అద్దెను చెల్లించాలని యజమాని డిమాండ్‌ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు సొంతూరికి పయనమయ్యారు. రూ. 500లకు ఓ సైకిల్‌ను కొన్నారు. మే 10వ తేదీన ఢిల్లీ నుంచి దర్భాంగకు తండ్రి, కూతురు సైకిల్‌పై బయల్దేరారు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం మోహన్ అనారోగ్య సమస్య వల్ల సైకిల్ తొక్కలేకపోయాడు.

దీంతో కూతురు జ్యోతి తన తండ్రిని కూర్చొబెట్టుకొని సైకిల్ తొక్కింది. వారం రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణించి..సొంతూరుకు చేరుకుంది. గురుగ్రామ్ నుంచి బీహార్‌కు ఏడు రోజుల్లో 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన విషయాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో ఆ బాలిక సాహసం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా జ్యోతిపై ప్రశంసల వర్షం కురిసింది.

 

Read:  24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్