Covid 19: నిజాలు దాచిన చైనా.. 2019 అక్టోబర్‌లోనే కరోనా తొలికేసు?

కరోనా మహమ్మారి చైనా సృష్టించిందా.. లేక పరీక్షలు జరుగుతుండగా లీకై వ్యాపించిందా?.. అసలు కరోనా మానవ సృష్టా లేక సాధారణంగానే తయారైన వైరసా?.. చైనా కోవిడ్ పై నిజాలను దాచిపెడుతుందా? తొలి కేసు నమోదైన దగ్గర నుండి చైనా డేటాను షేర్ చేయకుండా ఎందుకు దాచిపెట్టింది? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Covid 19

Covid 19: కరోనా మహమ్మారి చైనా సృష్టించిందా.. లేక పరీక్షలు జరుగుతుండగా లీకై వ్యాపించిందా?.. అసలు కరోనా మానవ సృష్టా లేక సాధారణంగానే తయారైన వైరసా?.. చైనా కోవిడ్ పై నిజాలను దాచిపెడుతుందా? తొలి కేసు నమోదైన దగ్గర నుండి చైనా డేటాను షేర్ చేయకుండా ఎందుకు దాచిపెట్టింది? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే.. చైనా చెప్పినట్లుగా 2019 డిసెంబర్లో తొలి కేసు నమోదు అవాస్తవమని.. అక్కడ అక్టోబర్ లోనే తొలి కేసు నమోదైనదని మరోసారి వాదన తెరమీదకొచ్చింది.

చైనాలో వైరస్ వచ్చిన దగ్గర నుండి అధ్యయనం చేసిన బ్రిటన్‌ పరిశోధకులు అధ్యయన ఫలితాలు తాజాగా ఓ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్‌ మూలాలపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో వాటి మూలాలను చైనా చెరిపేస్తున్నట్లు ఈ జర్నల్ పేర్కొంది. ఇదే సమయంలో కరోనా వైరస్ డిసెంబర్‌ 2019లో బయటపడిందని చైనా చెబుతున్నప్పటికీ.. అంతకు రెండు నెలలముందే, అంటే అక్టోబర్‌ లోనే వైరస్‌ వ్యాప్తి చెందిందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌కు చెందిన డేవిడ్‌ రాబర్ట్‌ బృందం చేసిన అధ్యయనంలో తేలింది.

అక్టోబర్‌, నవంబర్‌ మధ్యకాలంలోనే చైనాలో తొలికేసు నమోదవగా జనవరి 2020 నాటికి ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే అంచనాకు వచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి చైనా అధికారికంగా పేర్కొన్న దానికంటే.. అత్యధిక వేగంగా అది వ్యాప్తి చెందిందని బ్రిటన్‌ నిపుణులు పేర్కొన్నారు. 2020 జనవరి 3న జపాన్‌లో తొలికేసు, జనవరి 7న థాయిలాండ్‌లో తొలికేసు, జనవరి 12న స్పెయిన్‌లో తొలికేసు, దక్షిణ కొరియాలో జనవరి 14న వైరస్‌ వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. ఇక కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ జర్నల్ లో పేర్కొన్నారు.