Ganesh Chaturthi Special Our Ganapayya Is The God Who Removes All Vighnas
Ganesh Chaturthi: సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు. సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు మా బొజ్జ గణపయ్య. అందుకే, ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు. పనులకు, సిద్ధికి ఆటంకాలే విఘ్నాలు, విపత్తులే విఘ్నాలు అంటూ శాస్త్ర నిర్వచనం. ఆ విఘ్నాలను తొలగించే దైవంగా వినాయకుడిని కొలుచుకొంటారు. మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తారు.
సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడి సృష్టి రచనా మహాకార్యానికి విఘ్నాలు కలిగినప్పుడు, అవి తొలగడానికై ఓంకారాన్ని జపిస్తూ, ఆ ప్రణవ తేజస్సును ధ్యానించాడని, ఆ తేజస్సే గజవదనంతో వక్రతుండ స్వరూపంగా దివ్యాకారంతో సాక్షాత్కరించిందని స్కందపురాణంలో, తాపినీయోపనిషత్తులో వర్ణించారు. తిరిగి ఆ తేజస్సే శివపార్వతీ తనయుడిగా వ్యక్తమైందని పురాణోక్తి. బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించినది మాఘ బహుళ చతుర్థినాడు కాగా ఉమాశంకరులకు పుత్రుడై ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ చతుర్థిన. అందుకే రెండు చవితి తిథులను గణేశ ఆరాధనకు ప్రశస్తంగా భావిస్తారు.
భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని ఈ వినాయక చవితి జరుపుకుంటారు. గణపతి నవరాత్రులు, అందంగా అలంకరించిన మండపాలు ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణ కాగా.. ప్రతి ఇంటా వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తారు. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రభావంతో ఆ గణనాథునికి వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు కాస్త ఇబ్బందులు ఎదురవగా ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని ఆ గణనాథుణ్ని కోరుకుందాం. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని మంచి మనసుతో వేడుకుందాం.