భారతదేశంలో మహిళలు వివాహం చేసుకోవటానికి చట్టబద్దమైన వయస్సు త్వరలో మారేలా కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మహిళల పెళ్లి వయస్సుపై ఆందోళన నెలకొంది. ఇప్పుడు మహిళల్లోనూ మెరుగైన ఉన్నత విద్య, వృత్తికి ఎక్కువ మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అందుకే వారి వృతి, విద్యావకాశాల దృష్ట్యా మహిళల వివాహ కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 21ఏళ్లకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మహిళల వివాహ వయస్సును మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. అదేగానీ జరిగితే రానున్న రోజుల్లో మహిళ కనీస వివాహ వయస్సు 21 ఏళ్లుగా మారనుంది.
స్వాతంత్ర్యం నాటి సమయంలో 1950లో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బాల్య వివాహ చట్టంలో అనేక సవరణలు వచ్చాయి. 1978 నుంచి వివాహానికి కనీస చట్టపరమైన వయస్సు మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లుగా ఉంది. ఫిబ్రవరిలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 1929 నాటి శారదా చట్టాన్ని సవరించడం ద్వారా 1978లో మహిళల వివాహ వయస్సు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పెంచినట్టు తెలిపారు.
భారతదేశం మరింత అభివృద్ధి చెందుతున్నప్పుడు, మహిళలకు ఉన్నత విద్య, వృత్తిని అభ్యసించే అవకాశాలు ఉన్నాయని, MMR (ప్రసూతి మరణాల రేటు)ను తగ్గించడం, పోషకాహార స్థాయిలను మెరుగుపరచడమనేవి అత్యవసరాలుగా పేర్కొన్నారు. మాతృత్వంలోకి ప్రవేశించే అమ్మాయి వయస్సు మొత్తం సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సిఫార్సులను ఆరు నెలల సమయంలోగా సమర్పించే టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని తాను ప్రతిపాదించినట్టు మంత్రి నిర్మల తెలిపారు.
దీని ప్రకారం.. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (WCD) ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అంటే.. మహిళలకు వివాహం చట్టబద్దమైన వయస్సు 18 నుండి 21కి పెరిగే అవకాశం ఉంది. ఈ సిఫారసులను జూలై 31లోగా సమర్పించనున్నట్టు WCD తెలిపింది. టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ think-tank Niti Aayog సహకరిస్తుంది. ప్రసవ వయస్సు, మాతృత్వం, ప్రసవానికి ముందు, తరువాత, పిల్లలు, తల్లి పోషక స్థితి మధ్య సంబంధాలను అధ్యయనం చేసే 10 మంది సభ్యులు ఇందులో ఉంటారు. మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే పద్ధతులను కూడా దీనిలో సూచిస్తారు.
బాల్య వివాహం ప్రభావం :
వివాహ వయస్సు తల్లి, పిల్లల ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు పురుషులు, మహిళలకు ఒకే వయస్సు వైపు ఉండేలా మార్పులు చేయాలని భావిస్తోంది. 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్న బాలికలు అవాంఛిత గర్భాలకు లోనయ్యే అవకాశం ఉందని, లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడుతున్నారని, గర్భధారణ సంబంధిత సమస్యలు, తల్లి మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది.
ఎందుకు ముఖ్యమైనదంటే? :
చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్న తల్లులకు జన్మించిన పిల్లలలో శిశు మరణాలు, చిన్న పిల్లల మరణం గణనీయంగా ఉన్నాయని NCBI నివేదిక పేర్కొంది. మరొక నివేదిక ప్రకారం.. 2005-2006 సంవత్సరానికి, భారతదేశంలో 20-24 ఏళ్ల మధ్య వయస్సు గల స్త్రీలలో 44.5 శాతం మంది 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్నట్లు నివేదించారు. 20-24 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళల్లో 22 శాతం మంది 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు వారి మొదటి బిడ్డతో గర్భవతిగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2017-19లో గర్భధారణ, ప్రసవ సమయంలో సమస్యల కారణంగా మరణించిన 15-19 ఏళ్ల వయస్సు గల బాలికల్లో 35,000 వరకు మంది ఉన్నట్టుగా చెబుతోంది. వైవాహిక వయస్సులో లింగ సమానత్వాన్ని తొలగించడంపై టాస్క్‌ఫోర్స్ దృష్టి సారిస్తోంది.