Self Charging Electric Car: ఎలక్ట్రిక్ కారే కానీ ఛార్జింగ్ అవసరం లేదు!

ఎలక్ట్రిక్ వాహనమే కానీ ఛార్జింగ్ అవసరమేలేని ఒక కార్ మాత్రం ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. అమెరికాకు చెందిన ‘ఆప్టెరా’ అనే కంపెనీ పారాడిగ్మ్ అనే పేరుతో సెల్ఫ్ ఛార్జింగ్ అయ్యే ఒక కారును తయారుచేసింది.

Self Charging Electric Car: ఈ మధ్య కాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. రోజు రోజుకు ఇంధన ధరలు మండిపోతుండటంతో సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అలాంటి వారికి ఎలక్ట్రిక్ వాహనాలు బెస్ట్ అప్షన్ గా మారుతున్నాయి. అయితే.. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ బెడద ఒకటి వేధిస్తుంది. మన దేశంలో తక్కువ సంఖ్యలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండడంతో ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా అందుబాటులో లేవు. పైగా ఎక్కువ సమయం ఛార్జ్ చేస్తేనే ఈ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించగలడం మరొక మైనస్ గా మారింది.

ప్రధాన నగరాలు.. రోజువారీ కార్యక్రమాలలో యాభై, అరవై కిమీ దూరం ప్రయాణించే ప్రజలు ఈ వాహనాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరగగా.. కార్ల వంటి పెద్ద వాహనాల విషయంలో మాత్రం ఛార్జింగ్ అంశంపై ఆలోచన చేయాల్సి వస్తుంది. అయితే.. ఎలక్ట్రిక్ వాహనమే కానీ ఛార్జింగ్ అవసరమేలేని ఒక కార్ మాత్రం ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. అమెరికాకు చెందిన ‘ఆప్టెరా’ అనే కంపెనీ పారాడిగ్మ్ అనే పేరుతో సెల్ఫ్ ఛార్జింగ్ అయ్యే ఒక కారును తయారుచేసింది.

Self Charging Electric Car1

ఛార్జింగ్ పెట్టకుండానే ఈ కార్ ఎలా ప్రయాణిస్తుందనే డౌట్ మీకు రావచ్చు. ఇందులో అమర్చిన సోలార్ ప్యానల్స్ సాయంతో ఈ కార్ తనకు తానే ఛార్జింగ్ చేసుకుంటుంది. ఇదొక్కటే కాదు.. ఈ సోలార్ ఎలక్ట్రికల్ కారు విశేషాల కుప్పగా చెప్పొచ్చు. కేవలం 3.5 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిమీ వేగాన్ని అందుకునే ఈ కార్ గరిష్ఠ వేగం గంటకు 177కిలోమీటర్లు. ఇందులో అమర్చిన బ్యాటరీలు ఒకసారి ఫుల్ ఛార్జి అయితే ఏకంగా 1600కిమీ నడుస్తుంది. ఒకవేళ ఛార్జ్ తగ్గినా మళ్ళీ అందుబాటులోని సూర్యరశ్మి ద్వారా అదే ఛార్జ్ చేసుకుంటుంది.

ఇక చూసేందుకు ముంగిస ఆకారంలో ఉండే ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుండగా గతఏడాది డిసెంబర్ నుండి బుకింగ్స్ మొదలుపెట్టగా త్వరలోనే డెలివరీలకు సిద్ధమైంది. రెండు మోడళ్లలో లభించే ఈ కారులో పారాడిగ్మ్ 29వేల డాలర్లు కాగా.. పారాడిగ్మ్ ప్లస్ 46900 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ కారుకు పెద్ద ఎత్తున బుకింగ్స్ జరగగా ఒకవైపు డెలివరీ ఇస్తూనే మరోవైపు బుకింగ్స్ కూడా చేసుకోవాలని చూస్తుంది. మరి మన దేశంలో ఇలాంటి సోలార్ ఎలక్ట్రిక్ కార్లు ఎప్పుడు వస్తాయో మన పెట్రోల్ బాధలు ఎప్పుడు తీరనున్నాయో ఏమో!

ట్రెండింగ్ వార్తలు