Theeram Movie : ‘తీరం’ సినిమాలోని పాటలు ఎస్పీ బాలుకి అంకితం..

గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. ‘తీరం’ చిత్రంలోని పాటలను ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు..

Theeram Movie Songs Dedicated To S P Balasubrahmanyam

Theeram Movie: గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. ‘తీరం’ చిత్రంలోని పాటలను ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.. ‘తీరం’ చిత్రంలో ఆయన పాడిన చివరి పాట ‘అసలేంటీ ప్రేమా’ పాటతో పాటు, మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలుకి అంకితం చేశారు. ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, బాల సుబ్రహ్మణ్యం అభిమానులకోసం పూర్తి ఉచితంగా ‘ఫ్రీ టు ఎయిర్’ గా విడుదల చేశారు.

ఈ సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘తీరం’ సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిస్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా నిర్మాత శ్రీలత, సునిల్, అజయ్, ప్రభు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిస్టెన్ రవళి నాయికా నాయకులుగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో మ్యూజికల్ లవ్ స్టోరీగా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో ‘తీరం’ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా థియేటర్, డిజిటల్, శాటిలైట్ మరియు ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తరువాత విడుదల చేయనున్నారు.

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘తీరం’ సినిమాలోని బాలు గారు పాడిన ‘అసలేంటీ ప్రేమా’ పాట విన్నాను.. బ్యూటిఫుల్‌గా ఉంది. సాహిత్యం పరంగా వేటూరి గారిని, కెమెరా పనితనం పరంగా బాలూ మహేంద్ర గారిని, గాత్రం పరంగా బాలూలోని నవయవ్వన మధురస్వరం మనల్ని మైమరపించేలా ఉంది’’ అన్నారు.

ప్రముఖ పాటల రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ‘‘75 సంవత్సరాల బాలూలోని యువస్వరాన్ని ఆవిష్కరించింది ఈ ‘తీరం’ లోని పాట’’ అన్నారు..

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘తీరం’ సినిమాలో సంగీతం, సాహిత్యం బాలూ గాత్రంలో అమృతమై కురిసిందనీ, ఆ అమృతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

సంగీత దర్శకులు రఘురాం మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలోని పాటలను బాలు గారికి అంకితం ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం, ఆ మధురమైన పాట ప్రేక్షకులు హృదయాలలో నిలిచి ఉంటుంది’’ అని తెలిపారు.

చిత్ర దర్శకుడు, నిర్మాత అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ.. ‘‘ప్రముఖ గాయకులు స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు, తను అనారోగ్యానికి గురికావడానికి మూడు రోజులముందు చెన్నైలోని కోదందపాణి స్టూడియోలో మా చిత్రం కోసం ‘అసలేంటీ ప్రేమా’ అనే పాట పాడారు. ఆ తరువాత మూడు రోజులకే ఆయన కోవిడ్ బారినపడి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, ఆ తరువాత మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. పాట పాడుతున్నప్పుడు, సంగీతం.. సాహిత్యం ఒకదానికొకటి పోటీ పడ్డాయి అన్నట్లుగా తీర్చి దిద్దారు, పాట ఖచ్చితంగా హిట్ అవుతుందని నన్ను అభినందించారు బాలు గారు. ఆయన మా సినిమా కోసం పాడిన ఈ ‘అసలేంటీ ప్రేమా’ పాటతో పాటు, సినిమాలో ఉన్న 8 పాటలను కూడా ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇస్తున్నాము. అన్ని టెలివిజన్, రేడియో, డిజిటల్ మాధ్యమాలలో ఈ పాటను ఉచితంగా వినేలా ‘ఫ్రీ టు ఎయిర్’ విధానంలో ఈరోజు విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు.

హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ.. ‘‘తీరం సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలోని పాటలు యువతరాన్ని బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్‌గా సాగే ఎమోషనల్ లవ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచెయ్యడం ఖాయం, ఈ సినిమా ఖచ్చితంగా యూత్, ప్రేక్షకులను మెప్పించి ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’’.. అన్నారు.

హీరోయిన్ క్రిస్టెన్ రవళి మాట్లాడుతూ.. ‘‘మహా గాయకుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు మా ‘తీరం’ లో ఆలపించిన ‘అసలేంటీ ప్రేమా’ పాటలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాలో పూర్తి స్థాయిలో భావోద్వేగంతో కూడుకుని.. చిలిపిగా ఉంటూనే నటనకు ఆస్కారమున్న పాత్ర చేశాను.. ఇంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిన అనిల్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు..

సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని మాట్లాడుతూ.. ‘‘తీరం’ సినిమా చూశాను.. అత్యద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ విజువల్‌గా అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. అందుకే మా సినెటేరియా మీడియా వర్క్స్ ద్వారా లాక్‌డౌన్ అయిపోగానే ‘తీరం’ సినిమాను అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం’’ అని తెలిపారు..

చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ బి.జె మాట్లాడుతూ.. ‘‘స్వరీయ ఎస్.పి. బాలు గారితో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం. ‘అసలేంటీ ప్రేమా’ పాట రికార్డింగ్ సందర్భంగా శ్రీ ఎస్.పి. బాలూ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు నా జీవితానికి మంచి మార్గాన్ని సూచించాయి.. అది ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు..