పడవ ప్రమాదం.. 16కి పెరిగిన మృతుల సంఖ్య
గుజరాత్ లోని వడోదరలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కి పెరిగింది. సరస్సులో పడవ బోల్తా పడి 27 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కేంద్రం ఆదేశాలు
కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల బలవన్మరణాలు అధికమవుతుండడంతో కేంద్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులనే కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవాలి. 16 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులను చేర్చుకోవద్దు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. అధిక రుసుములు వసూలు చేయకుండా విద్యా శాఖ నిబంధనలు రూపొందించింది.
ఇందులో వివాదం ఏమీ లేదు: ఆలపాటి రాజా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో తెనాలి సీటు ఎవరికి దక్కుతుందన్న విషయంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా స్పందించారు. ఆ విషయంలో వివాదం ఏమీ లేదని చెప్పారు. జనసేన పార్టీతో పొత్తును స్వాగతిస్తున్నానని అన్నారు. తెనాలి సీటుపై స్థానిక టీడీపీ నాయకుల అభిప్రాయాలు తీసుకునేందుకు సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు హాఫ్ డే మాత్రమే పనిచేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటన చేసింది.
హర్ష కుమార్ దీక్ష..
రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్ష చేపట్టారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ ఆయన దీక్ష చేపట్టారు. శ్రీనును ఐదేళ్లు జైలులో పెట్టడం దుర్మార్గమని, దళితులంటే జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాలని, జగన్ ను ఓడించే వరకు పోరాడతామని అన్నారు.
నామినేషన్లు దాఖలు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో గురువారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
సస్పెన్షన్ వేటు ..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, ఎపిక్ కార్డుల వ్యవహారంలో ఈసీ చర్యలు చేపట్టింది. అప్పటి తిరుపతి ఆర్వో, ఏఆర్వో, బీఎల్వోలపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీచేసింది. 30వేలకుపైగా నకిలీ ఓట్లు, ఓటర్ కార్డులు జారీ అయినట్లు గుర్తించి ఈసీ.. ఐఏఎస్ అధికారి గిరీషాపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా గిరీషా కొనసాగతున్నారు. తిరుపతి లోక సభ ఉప ఎన్నికల సమయంలో గిరీషా రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు.
మరోసారి విచారణకు దూరం..
ఈడీ విచారణకు మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. విచారణకు రాలేనని ఈడీకి కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు. ముందస్తు కార్యక్రమాలతో విచారణకు రాలేనని కేజ్రీవాల్ ఈడీకి సమాచారం అందించారు.
ఎన్టీఆర్ కు ఘన నివాళి ..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని అన్నారు. సంక్షేమం అనే పదానికి మారుపేరు ఎన్టీఆర్.. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారని పురందేశ్వరి గుర్తు చేశారు.
చంద్రబాబు పర్యటన ..
ఎన్టీఆర్ జిల్లా నిమ్మకూరు, గుడివాడల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు హెలికాప్టర్ లో చంద్రబాబు, భవనేశ్వరి నిమ్మకూరుకు చేరుకుంటారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నారు. గుడివాలో లక్షమందితో సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5గంటలకు గుడివాడలో ‘రా కదలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అంతకుముందు ఉదయం 10గంటలకు అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
షర్మిల కుమారుడి నిశ్చితార్థం..
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో ఇవాళ జరగనుంది. ఈ నిశ్చితార్థ కార్యక్రమంకు షర్మిల ఇప్పటికే వైఎస్ జగన్ తో పాటు ప్రతిపక్షం, స్వపక్షాలతో పాటు అందర్నీ ఆహ్వానించారు.
21న బాధ్యతలు స్వీకరణ..
ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ఈనెల 21న ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో పీసీసీ బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఈనెల 22న ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలను వైఎస్ షర్మిల కలవనున్నారు.
సంక్రాంతి సెలవులు పొడిగింపు..
ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించారు. సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు, టీచర్ల విజ్ఞప్తి తో ఏపీ పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 22న పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
ఎమ్మెల్సీ నియామకానికి బ్రేక్..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్సీల కేసు హైకోర్టులో తేలేవరకు నియామకాలను నిలిపివేయాలని గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు.