కనిగిరి వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో అసమ్మతి పోరు భగ్గుమంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కు ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోడంపై ఆయన వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. భారీగా బుర్రా మధుసూదన్ వర్గం నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ గా మధుసూదన్ ను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రుషికొండకు మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నగరంలోని రాడిసన్, బ్లూ హోటల్‌కి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి విశాఖలో బస చేయనున్నారు. రేపు రుషికొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొననున్నారు.
మూసీ పునరుద్ధరణపై లండన్‌లో రేవంత్ రెడ్డి చర్చలు
లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ పునరుద్ధరణ, సుందరీకరణపై అధ్యయనం చేసేందుకు థేమ్స్ నది నిర్వహణ అధికారులతో చర్చించారు. థేమ్స్ రివర్ చరిత్రతో పాటు దాని అభివృద్ధికి ఎదురైన సవాళ్ల వంటి వాటిని రేవంత్ రెడ్డికి పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు వివరించారు.
వారిని అడవులకే పరిమితం చేయాలనుకుంటున్నారు: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోంలో కొనసాగుతోంది. ఇవాళ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆదివాసీలను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు.
బేగంపేట లైఫ్ స్టైల్ భవనంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని బేగంపేట లైఫ్ స్టైల్ భవనంలో మొదటి అంతస్తులో ఉన్న ఓ సెలూన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో సిలిండర్ లీక్ కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికీ ముప్పు వాటిల్లలేదు.
సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. 17ఏ పైన ఇటీవలే తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్ కు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్.. ధర్మాసనాన్ని కోరారు. ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
21న బాధ్యతలు స్వీకరణ ..
వైఎస్ షర్మిల ఈ నెల 21న ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ వెళ్లి YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. 21న కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో ఉదయం 11 గంటలకు PCC చీఫ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
పవన్ తో బాలశౌరి భేటీ..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన బాలశౌరి.. పవన్ తో పలు విషయాలపై చర్చించారు. త్వరలో బాలశౌరి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, మచిటీపట్నం లేదా గుంటూరు ఎంపీగా జనసేన నుంచి బాలశౌరి బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దారుణం..
బాగ్ అంబర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు రైలు కింద పడి బలవన్మరణంకు పాల్పడ్డాడు.
ఘోర అగ్నిప్రమాదం ..
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి 8గంటల సమయంలో పీతమ్ పురాలోని ఓ అపార్టు మెంటులో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఢిల్లీలో పొగమంచు ..
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండి వెలుపల ఉన్న క్యూలైన్లు ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతుంది. నిన్న (గురువారం) శ్రీవారిని 62,649 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వచ్చింది.
అయోధ్యకు టీటీడీ లడ్డూలు..
అయోధ్యలో ఈనెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ లక్ష లడ్డూలను టీటీడీ అయోధ్యకు తరలించనుంది.