కరోనాను తప్పించుకున్నా, యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. మృత్యు భయంతో  ఏ మనిషికి ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియనంతగా భయపడిపోతున్నారు ప్రజలు. కరోనా సోకినా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇళ్లకు వెళుతున్న వారూ ఉన్నారు.

హైదరాబాద్ లో మామా అల్లుళ్ళిద్దరికీ కరోనా సోకింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళుతుంటే యాక్సిడెంట్ రూపంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. కరోనాను జయించినా మృత్యువు మరో రూపంలో వారిని కాటేయటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలోని గుజ్జరి విజయకుమార్ అనే విద్యార్ధి లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో వంటలు చేసే మేనమావ వద్దకు వచ్చాడు. ఇక్కడ మెస్ లో వంటలు చేసే మేనమావకు కొన్నాళ్లకు కరోనా సోకింది. పరీక్షలు నిర్వహిస్తే అతనితోపాటు ఉన్న మేనల్లుడు విజయకుమార్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.

రెండు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ రావటంతో డాక్టర్లు వారిని డిశ్చార్జ్ చేశారు. కరోనా ను విజయవంతగా జయించిన ఆనందంలో మామా అల్లుళ్లు ఇద్దరూ కలిసి మేనమామ స్వగ్రామమైన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటకు బైక్‌పై బయల్దేరారు. అయితే, మనోహరాబాద్‌ శివారులో యూటర్న్‌ తీసుకుంటున్న లారీని వీరి బైక్‌ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మేనమామ అక్కడికక్కడే మరణించగా , గాయపడిన విజయ్‌ కుమార్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగి పోయారు. శనివారం కళ్యాణి గ్రామంలో అతడి అంత్యక్రియలు నిర్వహించారు.