Womens Health
Women Health : ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండే ఆఇల్లు నిత్యం ఆనందాలతో కళకళాడుతుందట. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపరు. కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టిన నాటి నుండి భర్త, పిల్లలు అంటూ కుటుంబపరమైన జీవితమే తప్ప తన ఆరోగ్య సంబంధ విషయాలపై దృష్టిపెట్టటం జరగదు. ఆరోగ్య విషయంలో మహిళలు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే ఇటీవలికాలంలో చిన్న వయస్సులోనే మరణాలు సంభవిస్తున్నాయి. మంచి పోషకాహారం, వైద్యం సదుపాయాలు కల్పిస్తే పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువకాలం జీవించగలుగుతారాని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారతీయ మహిళల్లో ఎక్కువ మంది గుండెపోటు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు, షుగర్ , థైరాయిడ్ , క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతున్నారు. అయితే తొలిదశలో గుర్తించి వైద్యం చేయించుకోవాల్సి ఉండగా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వయస్సు 35 దాటిన మహిళలంతా తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
35సంవత్సరాల వయస్సు రాగానే ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. దీని వల్ల శరీరంలో వచ్చే మార్పులు. అవయవాల పనితీరులో వెలుగుచూసే సమస్యలన్నీ పరీక్షల ద్వారా నిర్ధారణ అవుతాయి. సమస్యలను గుర్తిస్తే సకాలంలో చికిత్స తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తే చివరకు తీవ్రమైన ఆనారోగ్య సమస్యలకు దారితీయటం చివరకు ప్రాణాలకు ముప్పుతోపాటు, ఆర్ధికంగా, కుటుంబపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి.
చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే….
లిపిడ్ ప్రొఫైల్.. లిపిడ్స్ అని పిలిచే రక్తంలోని నిర్దిష్ట కొవ్వు అణువుల పరిమాణాన్ని కొలుస్తుంది. సీబీసీతో కొలెస్ట్రాల్‌ని గుర్తించవచ్చు. ఈ పరీక్ష గుండె జబ్బులు, రక్త నాళాల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి సహాయపడుతుంది. ఆహార అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం, జీవనశైలిని సరిచేయడానికి లిపిడ్ ప్రొఫైల్‌ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా థైరాయిడ్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ పేలవమైన లిపిడ్ ప్రొఫైల్‌తో సంబంధం కలిగి ఉంటుంది.
మన దేశంలో హైపోథైరాయిడిజం సమస్య మహిళలను అధికంగా బాధిస్తోంది. ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్య బారిన పడుతున్నారు. 20 ఏండ్ల వయసు దాటి ప్రతీ ఒక్క మహిళ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గుర్తించవచ్చు. థైరాయిడ్ రుగ్మత పురుషులతో పోలిస్తే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ. 35 సంవత్సరాల వయసు తర్వాత హైపోథైరాయిడిజం ప్రమాదం పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స పొందటం వల్ల ఆరోగ్యపరంగా మేలు కలుగుతుంది.
రక్తహీనత, ఇన్‌ఫెక్షన్, కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడానికి సీబీపీ నిర్వహిస్తారు. ఎర్ర, తెల్ల రక్త కణాల కౌంటింగ్, హిమోగ్లోబిన్, హెమటోక్రిట్, ప్లేట్‌లెట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరీక్షను 20 ఏండ్ల వయసు దాటిన మహిళలకు చాలా ముఖ్యమైనది. మన దేశంలో చాలా మంది మహిళలు ఐరన్ లోపాన్ని సహజంగా ఎదుర్కొంటున్నందున ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకుని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మన దేశంలోని మహిళల్లో ఎక్కవ మంది రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 40 ఏండ్ల వయసు దాటిన తర్వాత మామోగ్రఫీ చేయించుకోవడం చాలా అవసరమని క్యాన్సర్ వ్యాధి నిపుణులు అంటున్నారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న మహిళలకు 20 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్షించాలి. మహిళల్లో గర్భాశయం క్యాన్సర్ ముప్పు అధికంగానే ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా అలాంటిది ఉంటే ముందే గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
35-49 ఏండ్ల మధ్య ఉన్న చాలామంది మహిళలు మధుమేహం బారిన పడుతున్నారు. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నప్పటికీ.. లక్షణాలు తెలియకపోవటంతో సరైన చికిత్స తీసుకోక అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. షుగర్ పరీక్షలు చేయించుకుంటే సరైన చికిత్స పొందటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
మగవారికంటే స్త్రీలలోనే ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నట్లు ఇటీవల పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాధమిక దశలోనే మహిళలకు వస్తున్న వ్యాదులను గుర్తించి వైద్య చికిత్సలను అందించటం అవసరం. ఇలాంటి ఆరోగ్య విషయాలపై మహిళలు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి.